ట్రాఫిక్ కష్టాలు తప్పించుకునేందుకు... ముంబయి లోకల్ రైలులో బిలియనీర్ ప్రయాణం

Mumbai Billionaire Travels In Local Train
  • ఏసీ బోగీలో హీరానందనీ ప్రయాణం
  • వీడియోకు 22 మిలియన్ల వీక్షణలు
  • నెటిజన్ల ప్రశంసలు 
దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబయిలో ప్రతీ రోజూ లోకల్ రైళ్లలో లక్షలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. కానీ ఓ బిలియనీర్ సాదాసీదాగా లోకల్ రైలులో ప్రయాణించారు. ఎందుకో తెలిస్తే షాకవుతారు! రియల్ ఎస్టేట్ దిగ్గజమైన బిలియనీర్ నిరంజన్ హీరానందానీ ముంబయి లోకల్ రైలులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. హీరానందానీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్  అయిన 73 ఏళ్ల హీరానందినీ శుక్రవారం తన రైలు ప్రయాణం వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. 

ఇతర ప్రయాణికులతో కలిసి ప్లాట్ ఫాం పై వేచి ఉన్న హీరానందానీ ఏసీ బోగీలో ఎక్కి థానే జిల్లా ఉల్లాస్ నగర్ రైల్వేస్టేషన్ వరకు ప్రయాణించారు. ఈ రైలు ప్రయాణంలో ఆయనతోపాటు అతని బృందంలోని కొందరు సభ్యులు వెంట ఉన్నారు. తాను ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతోపాటు ట్రాఫిక్ అవరోధాలను అధిగమించడానికి లోకల్ రైలులో ప్రయాణించానని ఆయన పేర్కొన్నారు. 

హీరానందానీ షేర్ చేసిన వీడియోకు సోషల్ మీడియాలో 22 మిలియన్ల మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. ప్రజారవాణా అయిన లోకల్ రైలులో ప్రయాణించినందుకు బిలియనీర్‌ను నెటిజన్లు ప్రశంసించారు. దేశానికి మీలాంటి వారు చాలామంది కావాలి అని ఓ నెటిజన్ కోరారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని ఒక వ్యక్తిగా కలవాలని కోరుకుంటున్నాను సార్ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

‘‘సార్ మీరు తప్పు కోచ్‌లో ప్రవేశించారు. ఈ కోచ్‌లు వికలాంగులు, కేన్సర్ రోగులకు కేటాయించింది’’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ‘‘మీరు వికలాంగుల విభాగంలో కూర్చున్నారు’’ అని మరో నెటిజన్ గుర్తుచేశాడు. మొత్తంమీద బిలియనీర్ హీరానందానీ లోకల్ రైలు ప్రయాణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Advertisement
Niranjan Hiranandani
Mumbai
Billionaire
Local Train

More Telugu News