Anganwadi: ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి అంగన్ వాడీల పిలుపు

  • ప్రభుత్వంతో చర్చలు విఫలం.. కొనసాగుతున్న సమ్మె
  • జనవరి 3న కలెక్టరేట్ల దిగ్బంధం చేస్తామని వెల్లడి
  • విరమించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం వార్నింగ్
Anganwadi Union Leaders Reaction After Discussions With Minister Botsa Satyanarayana

వేతన పెంపు, ఉద్యోగ భద్రత డిమాండ్లతో ఆందోళన చేస్తున్న అంగన్ వాడీలు బుధవారం ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి పిలుపునిచ్చారు. మంగళవారం ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను తీవ్రం చేయాలని అంగన్ వాడీ సంఘాల నేతలు నిర్ణయించారు. అయినా ప్రభుత్వం దిగిరాకుంటే జనవరి 3న కలెక్టరేట్లను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అంగన్ వాడీల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. రాష్ట్ర సచివాలయంలో అంగన్ వాడీ సంఘాల నేతలతో మంత్రులు చర్చలు జరిపారు.

సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ అనుబంధ సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు చర్చించారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో వేతన పెంపు, గ్రాట్యూటీ అమలుపై ఇరు వర్గాల మధ్య పీటముడి పడింది. వేతనాల పెంపునకు సంక్రాంతి వరకు ఆగాలన్న మంత్రి బొత్స సూచనకు అంగన్ వాడీ సంఘాల నేతలు అంగీకరించలేదు. సమావేశం పూర్తయిన తర్వాత మంత్రి బొత్స, అంగన్ వాడీ సంఘాల ప్రతినిధులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.

వేతన పెంపునకు కొంత కాలం ఆగాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన సూచనపై అంగన్ వాడీ ఉద్యోగులు మండిపడుతున్నారు. సంక్రాంతి వరకు ఆగితే అప్పుడు బంగారు గనులేమన్నా పుట్టుకొస్తాయా అంటూ పలువురు ఉద్యోగులు నిలదీస్తున్నారు. పదవీ విరమణ ప్రయోజనాలు పెంచామన్న మంత్రి వ్యాఖ్యలపైనా విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగమని చెప్పి పింఛన్ తీసేశారని గుర్తుచేస్తూ.. రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే కార్యకర్తలకు రూ.50 వేలు పెంచారని విమర్శించారు. ఆయాలకు రూ.20 వేలు మాత్రమే పెంచారని అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు(సీఐటీయూ) బేబీరాణి వెల్లడించారు.

More Telugu News