Nara Lokesh: మంగళగిరి నియోజకవర్గం తటస్థ ప్రముఖులతో నారా లోకేశ్ భేటీ

  • 11 నెలల తర్వాత తొలిసారి మంగళగిరిలో పూర్తి స్థాయి పర్యటన
  • అడుగడుగునా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం
  • రేపు తాడేపల్లిలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం
Nara Lokesh met neutral people in Mangalagiri constituency

రాష్ట్రవ్యాప్తంగా 226 రోజుల పాటు 3132 కి.మీ.ల మేర పాదయాత్ర పూర్తి చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... 11 నెలల తర్వాత తొలిసారి సొంత నియోజక వర్గం మంగళగిరిలో పర్యటనకు వచ్చారు. సుదీర్ఘకాలం తర్వాత మంగళగిరిలో పర్యటించడంతో నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఆత్మీయస్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా నారా లోకేశ్ పలువురు తటస్థ ప్రముఖులను కలిసి నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. 

తొలుత ఆత్మకూరులో మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మంగళగిరి పట్టణంలో అతిపెద్ద మాస్టర్ వీవర్ అయిన జొన్నాదుల వరప్రసాద్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. మంగళగిరిలో చేనేతలు, నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే రోజుల్లో వారి కోసం చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. 

అనంతరం పద్మశాలి బహుత్తమ సేవా సంఘం అధ్యక్షుడు చింతకింది కనకయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకొని వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. పద్మశాలీయుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలంగా పోరాడుతున్న కనకయ్య పలు సమస్యలను ఈ సందర్భంగా లోకేశ్ దృష్టికి తెచ్చారు. 

రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్రలో ధర్మవరం, వెంకటగిరి వంటి ప్రాంతాల్లో పద్మశాలీయులు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లారా చూశానని, మరో 3 నెలల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం మీకు అండగా నిలుస్తుందని లోకేశ్ ఆయనకు భరోసా ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా గత నాలుగున్నరేళ్లుగా మీలో ఒకడిగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని, నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలందించేలా తనను ఆశీర్వదించాలని కోరారు. 

ఆ తర్వాత లోకేశ్ ప్రముఖ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్, వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు. అల్మాస్ 2021లో టర్కీలో జరిగిన ఏషియన్ అక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ అండ్ బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్, 2020లో గజియాబాద్ లో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పతకం సాధించారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక క్రీడాకారులకు అండగా నిలుస్తామని తెలిపారు.


రేపు తాడేపల్లిలో విస్తృతస్థాయి సమావేశం

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం బుధవారం (27-12-2023)  సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలో సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నారా లోకేశ్ హాజరుకానున్నారు. 

అతిథులుగా నియోజకవర్గ సమన్వయకర్త అబద్ధయ్య, సీనియర్ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, తమ్మిశెట్టి జానకీదేవి, మండల పార్టీ అధ్యక్షులతో పాటు నియోజకవర్గంలోని అనుబంధ సంఘాల బాధ్యులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఇటీవల కాలంలో మంగళగిరి నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో పార్టీ కేడర్ తో లోకేశ్ సమీక్షిస్తారు.

More Telugu News