Anganwadis Agitation: ఈ నెల 31 తర్వాత అంగన్‌వాడీల ఆందోళన మరింత తీవ్రతరం.. యూనియన్ నేతల వార్నింగ్

  • 14 రోజులుగా అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె  
  • తమ డిమాండ్లు న్యాయపరమైనవేనని పునరుద్ఘాటన
  • జీతాల పెంపు, గ్రాట్యుటీతో పాటు పలు డిమాండ్లు  
Agetation intensified After 31st of this month Anganwadis warns AP govt

వేతనాల పెంపు, గ్రాట్యుటీతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 31 తర్వాత ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని అంగన్‌వాడీ యూనియన్‌ నేతలు తెలిపారు. ఈ మేరకు విజయవాడలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అంగన్‌వాడీల డిమాండ్లు న్యాయపరమైనవని, ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో 14 రోజులుగా అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఆందోళనలో పాల్గొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీడీపీవో ఆఫీసులు, మండల కేంద్రాల్లో సమ్మె చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది వరకు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కనీస వేతనం రూ.26 వేలకు పెంపు, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తున్నారు. అంగన్‌వాడీల సమ్మెకు విపక్ష టీడీపీ, జనసేనతోపాటు పలు పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.

More Telugu News