రైతులు కరువు కోరుకుంటున్నారన్న కర్ణాటక మంత్రి... తీవ్రంగా స్పందించిన కేటీఆర్
- బెళగావిలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్
- ప్రభుత్వం నుంచి రుణమాఫీ కోసం రైతులు కరువు కోరుకుంటున్నారని వ్యాఖ్య
- ఎంతటి దుర్భర పరిస్థితుల్లోనూ రైతులు అలా కోరుకోరని కేటీఆర్ కౌంటర్
బెళగావిలో జరిగిన ఓ సమావేశంలో రైతు రుణమాఫీలపై మంత్రి శివానంద్ పాటిల్ మాట్లాడుతూ... రైతులకు కరెంటు, నీరు ఉచితంగా లభిస్తున్నాయని.. ఎంతోమంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో వ్యవసాయరంగ బలోపేతానికి సహకారం అందించారన్నారు. కానీ రైతులు మాత్రం ప్రతి సంవత్సరం కరువు రావాలని కోరుకుంటున్నారని.. దీనివల్ల ప్రభుత్వం నుంచి రుణమాఫీ పొందవచ్చని భావిస్తున్నారన్నారు. అలా మీరు కోరుకోవడం సరికాదని రైతులకు సలహా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. శివానంద్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, ఎంతటి దుర్బర పరిస్థితుల్లోనైనా సరే రైతులు కరువును కోరుకోరని గుర్తు చేశారు.