CM Jagan: కడప రిమ్స్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్

  • కడప జిల్లాలో సీఎం జగన్ మూడ్రోజుల పర్యటన
  • నేడు కడపలో వివిధ ప్రారంభోత్సవాలకు హాజరు
  • రాత్రికి ఇడుపులపాయలో బస
CM Jagan three day tour in Kadapa district

ఏపీ సీఎం జగన్ మూడ్రోజుల నిమిత్తం నేడు కడప చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా కడప రిమ్స్ లో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. రిమ్స్ ప్రాంగణంలోనే మానసిక వైద్యశాలను, క్యాన్సర్ విభాగాన్ని కూడా ప్రారంభించారు. 

తన పర్యటనలో భాగంగా సీఎం జగన్ కడపలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవంలోనూ పాల్గొన్నారు. అటు, రూ.1000 కోట్లతో ఏర్పాటు చేసిన సెంచురీ ప్లై పరిశ్రమను ప్రారంభించారు. ఈ పరిశ్రమ వల్ల 2 వేల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను పంపిణీ చేశారు. 

అనంతరం కడపలో అంబేద్కర్ సర్కిల్ ను, ఆధునికీకరించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. కాగా, నేడు మరికొన్ని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్న సీఎం జగన్... అనంతరం ఇడుపులపాయ చేరుకుని రాత్రికి వైఎస్సార్ ఎస్టేట్ లోని గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. 

రేపు (డిసెంబరు 24) వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రార్థనా మందిరంలో దైవ ప్రార్థనలకు హాజరవుతారు. మధ్యాహ్నం నుంచి సింహాద్రిపురంలో పర్యటించి, వివిధ ప్రారంభోత్సవాలకు హాజరవుతారు. అనంతరం, ఇడుపులపాయ ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులను కలుస్తారు. 

రాత్రికి ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లోనే బస చేయనున్న సీఎం జగన్... ఎల్లుండి (డిసెంబరు 25) క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం కడప నుంచి బయల్దేరి తాడేపల్లి చేరుకుంటారు.

More Telugu News