Mayushi Bhagath: భారతీయ విద్యార్థిని ఆచూకీ చెబితే రూ.8.32 లక్షల రివార్డు.. అమెరికా ఎఫ్‌బీఐ ప్రకటన

  • ఉన్నత చదువుల కోసం వెళ్లి నాలుగేళ్లక్రితం న్యూజెర్సీలో అదృశ్యమైన మయూషి భగత్
  • ఎంత అన్వేషించినా ఆచూకీ దొరక్కపోవడంతో పౌరుల సాయం కోరిన ఎఫ్‌బీఐ
  • ఆచూకీ తెలిపిన వారికి 10 వేల డాలర్ల రివార్డు ఇస్తామని ప్రకటన
US FBI Announces 10000 dollars reward for Information On Missing Indian studen Mayushi Bhagath

అమెరికాలో నాలుగేళ్లక్రితం కనిపించకుండా పోయిన భారతీయ విద్యార్థిని మయూషి భగత్ ఆచూకీ కోసం ఆ దేశ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా బహిరంగ సాయాన్ని కోరింది. మయూషి భగత్‌ ఆచూకీకి సంబంధించిన సమాచారం తెలిపినవారికి 10,000 డాలర్ల (సుమారు రూ.8.32 లక్షల కోట్లు) రివార్డును అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్‌బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రకటించారు. మయూషి లొకేషన్ లేదా ఆమె ఆచూకీని కనుగొనే సమాచారం తెలిస్తే అందివ్వాలని కోరారు.

 29 ఏళ్ల మయూషి భగత్ నాలుగేళ్లక్రితం మే 1, 2019న న్యూజెర్సీలో అదృశ్యమైంది. చివరిసారిగా  ఏప్రిల్ 29, 2019న సాయంత్రం ఆమె న్యూజెర్సీ సిటీలోని తన అపార్ట్‌మెంట్‌లో పైజామా ప్యాంట్, నల్లరంగు టీ-షర్ట్ ధరించి కనిపించింది. మే 1, 2019న ఆమె అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎంతకీ ఆమె ఆచూకీ తెలియకపోవడంతో గతేడాది మిస్సింగ్ వ్యక్తుల జాబితాలో మయూషి పేరుని ఎఫ్‌బీఐ చేర్చింది. 

కాగా మయూషి భగత్ స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లింది. న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న క్రమంలో ఆమె అదృశ్యమైంది. ఆమె ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషలు మాట్లాడుతుందని, న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్‌లో ఆమెకు స్నేహితులు ఉన్నారని ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఆమె జుట్టు నల్లగా ఉంటుందని, కళ్లు గోధుమ రంగులో ఉంటాయని, ఎత్తు 5'10 అడుగులు ఉంటుందని వివరాలు పేర్కొంది. ఈ మేరకు ఎఫ్‌బీఐ తన వెబ్‌సైట్‌లోని మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల జాబితాలో మయూషి పేరుని 'మిస్సింగ్ లేదా కిడ్నాప్ అయిన వ్యక్తి'గా పేర్కొంది.

More Telugu News