Ramdulare Gond: బాలికపై లైంగిక దాడి కేసులో కోర్టు సంచలన తీర్పు.. యూపీ బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలుశిక్ష

  • 2014లో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఎమ్మెల్యే రాందులార్ గోండ్
  • ఈ కేసులో ఇటీవల ఎమ్మెల్యేను దోషిగా తేల్చిన న్యాయస్థానం
  • నిన్న జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు
  • అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోనున్న ఎమ్మెల్యే
UP BJP MLA Ramdulare Gond Gets 25Year Jail For Raping Minor

బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యేకు కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా విధించింది. ఘటన జరిగిన 9 సంవత్సరాల తర్వాత దోషిగా తేలి శిక్ష కూడా పడడంతో అసెంబ్లీ సభ్యత్వాన్ని కూడా ఆయన కోల్పోనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోన్‌భద్ర జిల్లాలోని దుద్ధి నియోజకవర్గ గిరిజన ఎమ్మెల్యే రాందులార్ గోండ్ 4 నవంబర్ 2014లో బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు.  దీనిపై మయోర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 

గతేడాది ఈ కేసు సోన్‌భద్రలోని ఎంపీ-ఎమ్మెల్యేల కోర్టుకు బదిలీ అయింది. ఈ కేసులో మంగళవారం అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. నిన్న శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 25 ఏళ్ల జైలు శిక్షతోపాటు పది లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధితురాలికి అందజేయాలని ఆదేశించింది. గోండ్‌కు శిక్ష పడడంపై బాధిత బాలిక కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎమ్మెల్యే గోండ్‌పై అనర్హత వేటు పడనుంది.

More Telugu News