రేపటి నుంచి మహిళలందరికీ జీరో టిక్కెట్లు జారీ: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్‌ను తీసుకుని ఆర్టీసీకి సహకరించాలని విజ్ఞప్తి
- ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తోందన్న సజ్జనార్
- ఆధార్, ఓటరు తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని సూచన
ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మహిళల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా పథకం అమలవుతోందని, పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ను.. సంస్థ అప్ డేట్ చేసిందని తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ను టిమ్ మెషిన్లలో ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు వెల్లడించారు. మెషిన్ల ద్వారా శుక్రవారం నుంచి జీరో టికెట్లను జారీ చేయనున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని సూచించారు. స్థానికత ధ్రువీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి జీరో టిక్కెట్‌ను పొందవచ్చునన్నారు.
ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేసి.. అందుబాటులో తీసుకువచ్చిన టీఎస్ఆర్టీసీ అధికారులను సజ్జనార్ అభినందించారు.