Suryakumar Yadav: విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్యకుమార్ యాదవ్

  • టీ20 ఫార్మాట్‌లో 56 ఇన్నింగ్స్‌ల్లోనే 2 వేల పరుగులు పూర్తి చేసిన సూర్య
  • దక్షిణాఫ్రికాపై రెండో టీ20 మ్యాచ్‌లో 56 పరుగులతో కెరీర్‌లో కీలక మైలురాయి
  • విరాట్ రికార్డును సమం చేసిన డాషింగ్ బ్యాట్స్‌మెన్
Suryakumar Yadav equaled Virat Kohlis record

టీ20 ఫార్మాట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ గత రాత్రి దక్షిణాఫ్రికాపై జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో రాణించారు. 155కిపైగా స్ట్రైక్ రేటుతో వేగంగా ఆడిన సూర్య 36 బంతుల్లోనే 56 పరుగులు రాబట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 180 పరుగులు సాధించడంలో సూర్య అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడు కెరీర్‌లో కీలకమైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసుకున్న భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కేవలం 56 ఇన్నింగ్స్‌ల్లోనే సూర్య రెండు వేల రన్స్ సాధించాడు. దీంతో కింగ్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. విరాట్ కూడా 56 ఇన్నింగ్స్‌లో 2,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పుడు దానిని సూర్య సమం చేసినట్టయ్యింది. కెరీర్‌లో కీలక మైలురాయిని చేరుకున్న కెప్టెన్‌కి బీసీసీఐ అభినందనలు తెలిపింది. ఎక్స్ వేదికగా పోస్ట్ షేర్ చేసింది. 

ఇక వేగంగా రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్ మూడవ స్థానంలో ఉన్నాడు. 58 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని సాధించాడు. రోహిత్ శర్మ 77 ఇన్నింగ్స్‌లలో రెండు వేల పరుగులు పూర్తి చేయడం గమనార్హం. ఇక అంతర్జాతీయంగా చూస్తే 2,000 పరుగుల మైలురాయిని వేగంగా చేరుకున్న ఆటగాళ్లలో పాకిస్థాన్‌ బ్యాటర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 52 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును అందుకున్నారు.

More Telugu News