Ganta Srinivasa Rao: ఎన్నికలకు రెండు నెలల ముందు జగనన్న కొత్త మోసానికి తెరలేపారు: గంటా

  • గ్రూప్-2, గ్రూప్-1 నోటిఫికేషన్లు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
  • ఫిబ్రవరి, మార్చిలో ప్రిలిమ్స్
  • ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పరిస్థితి ఏంటన్న గంటా శ్రీనివాసరావు
  • నిరుద్యోగులు అధైర్యపడాల్సిన పనిలేదని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా
Ganta Srinivasa Rao questions AP govt on group 1 and group 2 notifications

ఏపీ ప్రభుత్వం తాజాగా గ్రూప్-2, గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడంపై టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల పేరుతో జగనన్న రాష్ట్రంలో మరో కొత్త మోసానికి తెరలేపారని విమర్శించారు. చివరకు ఉద్యోగాల భర్తీని కూడా రాజకీయ ఎత్తుగడగా వాడుకుంటూ ఇష్టం వచ్చినట్టు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారని, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని గంటా మండిపడ్డారు. 

ఎప్పుడో 2021 నాటి జాబ్ క్యాలెండర్ కింద ప్రకటించిన గ్రూప్-2 నోటిఫికేషన్ ను మొన్న విడుదల చేశారని ఆరోపించారు. కొన్ని నెలల కిందట ప్రకటించిన గ్రూప్-1 నోటిఫికేషన్ ను నిన్న జారీ చేశారని వెల్లడించారు. మొన్నటికి మొన్న అదిగో డీఎస్సీ... ఇదిగో డీఎస్సీ అంటూ ఊదరగొట్టి నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారని, కానీ, చివరికి ఆ ఊసే లేకుండా చేశారని గంటా ధ్వజమెత్తారు. 

"గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫిబ్రవరి 25న జరుపుతారట... గ్రూప్-1 ప్రిలిమ్స్ మార్చి 17న నిర్వహిస్తారట... ఈ రెండింటికీ మెయిన్స్ ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో జరుగుతాయి. ఇదంతా ఎన్నికల గిమ్మిక్కు కాక మరేమిటి జగన్ మోహన్ రెడ్డి గారూ? నిజంగా ఉద్యోగాలు భర్తీ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల ముందే నోటిఫికేషన్ ఇచ్చేవారు. కానీ, ఒక ప్రణాళిక లేకుండా నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికల ముందు పరీక్షలు నిర్వహిస్తామనడం నిరుద్యోగులను మోసం చేయడం కాక మరేమిటి? 

డిసెంబరులో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో పరీక్షలు జరిపితే అభ్యర్థులు అందుకు అనుగుణంగా సబ్జెక్టుల్లో సన్నద్ధం కాగలరా? ఇంత తక్కువ సమయంలో వారు ఒత్తిడిని ఎలా ఎదుర్కోగలరు? చివరికి ఎలాగో కష్టపడి పరీక్షలకు సిద్ధమైతే, ఫిబ్రవరిలో గనుక ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వారి పరిస్థితి ఏమిటి? వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా?" అంటూ గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయితే, రాష్ట్రంలోని నిరుద్యోగులు అధైర్యపడాల్సిన పనిలేదని, భవిష్యత్తు మనదేనని గంటా ధీమా వ్యక్తం చేశారు. "రేపు అధికారంలోకి రాబోతోంది చంద్రన్న ప్రభుత్వమే. 2014-19 మధ్య కాలంలో ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించి భవిష్యత్తును చూపిన దార్శనికుడు చంద్రబాబు. 2024లో మీ పోస్టులను భర్తీ చేసి, మీ ఉద్యోగాలను మీకు ఇచ్చే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుంది" అని గంటా స్పష్టం చేశారు.

More Telugu News