RCB: ఆసీస్ ఆల్ రౌండర్ కోసం భారీ మొత్తం వెచ్చించిన ఆర్సీబీ... ఆశ్చర్యపోతున్న క్రికెట్ వర్గాలు

  • ఐపీఎల్ తాజా సీజన్ కోసం ముగిసిన రిటెన్షన్-రిలీజ్ ప్రక్రియ
  • కామెరాన్ గ్రీన్ ను రూ.17.75 కోట్లకు కొనుగోలు చేసిన ఆర్సీబీ
  • ముంబయి ఇండియన్స్ నుంచి కొనుగోలు చేసిన బెంగళూరు ఫ్రాంచైజీ
RCB expenses hugely for Aussies all rounder Cameron Green

ఐపీఎల్ కొత్త సీజన్ కు సన్నద్ధమవుతున్న ఫ్రాంచైజీలు ఇటీవల కొందరు ఆటగాళ్లను విడుదల చేశాయి. ఆయా జట్ల నుంచి విడుదలైన ఆటగాళ్లతో డిసెంబరు 19న వేలం నిర్వహించనున్నారు. దుబాయ్ లో జరిగే ఈ ఐపీఎల్ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

కాగా, 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. నిన్న గాక మొన్న వచ్చిన గుజరాత్ టైటాన్స్ కూడా ఐపీఎల్ ట్రోఫీ గెలవగా, హేమాహేమీలతో కూడిన ఆర్సీబీకి మాత్రం కప్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కొత్త సీజన్ కోసం సన్నాహాలు మొదలుపెట్టిన ఆర్సీబీ పలువురు బౌలర్లను వదులుకుంది. జోష్ హేజిల్ వుడ్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్ ను ఇటీవల విడుదల చేసింది. 

ఇప్పుడా జట్టు ఆల్ రౌండర్లపై కన్నేసింది. అందుకు నిదర్శనమే ఆసీస్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కొనుగోలు ఒప్పందం. గ్రీన్ ను ఏకంగా రూ.17.5 కోట్లు వెచ్చించి ముంబయి ఇండియన్స్ నుంచి కొనుగోలు చేసింది. ప్రస్తుతం బెంగళూరు ఫ్రాంచైజీ ఖాతాలో రూ.40.75 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బుతో నికార్సయిన ఆటగాళ్లను వేలంలో దక్కించుకునే వీలుంది. అయినప్పటికీ గ్రీన్ ను పెద్ద మొత్తానికి కొనుగోలు చేయడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. 

గ్రీన్ గత సీజన్ లో ముంబయి జట్టు తరఫున 16 మ్యాచ్ ల్లో 452 పరుగులు చేసి, 6 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్ లో గ్రీన్ ఓ సెంచరీ కూడా చేశాడు. అయితే, గ్రీన్ ను ఆర్సీబీ కొనుగోలు చేయడం వెనుక మరో ఆసక్తికర అంశం ఉన్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి కొనుగోలు చేయాలంటే ముంబయి ఇండియన్స్ కు భారీ మొత్తం అవసరం. అందుకే కామెరాన్ గ్రీన్ ను ఆర్సీబీకి విక్రయించి, ఆ డబ్బుతోనే హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసినట్టు టాక్ వినిపిస్తోంది.

More Telugu News