4 rare diseases: 4 అరుదైన వ్యాధులకు 100 రెట్లు తగ్గిన చికిత్స వ్యయం.. ఒకప్పుడు కోట్ల ఖర్చు.. ఇప్పుడు లక్షల్లోనే పూర్తి

  • ఏడాదిలోనే తక్కువ రేట్లకే మందులను అందుబాటులోకి తీసుకొచ్చిన కంపెనీలు
  • టైరోసినిమియా, గౌచర్స్, విల్సన్స్, డ్రావెట్ వ్యాధులకు ఏడాదికి కోట్లలోనే ఖర్చు
  • ప్రస్తుతం రెండు మూడు లక్షల రూపాయలతోనే చికిత్స తీసుకునేలా అందుబాటులోకి ఔషధాలు
  • అరుదైన వ్యాధులతో బాధపడుతున్నవారి కోసం కృషి చేసిన భారతీయ ఔషధ కంపెనీలు
100 times reduction in cost of treatment for 4 rare diseases

ప్రభుత్వరంగ సంస్థల సహకారంతో భారతీయ ఔషధ కంపెనీలు కేవలం ఏడాది వ్యవధిలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. జన్యుపరమైన 4 అరుదైన వ్యాధుల చికిత్సలో వాడే  మందులు తక్కువ రేటుకే అందుబాటులోకి వచ్చేలా కృషి చేశాయి. తద్వారా పిల్లలు ఎక్కువగా బాధితులుగా ఉన్న ఈ జన్యుపరమైన వ్యాధుల చికిత్స వ్యయాన్ని ఏకంగా 100 రెట్లు తగ్గించగలిగాయి. టైరోసినిమియా టైప్ 1 వ్యాధి వైద్యానికి ఏడాదికి ఏకంగా రూ.2.2 కోట్ల నుంచి రూ. 6.5 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కేవలం రూ.2.5 లక్షలు వెచ్చిస్తే సరిపోతుంది. కాగా టైరోసినిమియా వచ్చిన పిల్లలకు చికిత్స అందించకపోతే 10 ఏళ్ల లోపు చనిపోతారు. ఈ వ్యాధి చికిత్సకు అందించే ఔషధాన్ని ‘నిటిసినోన్’ అని అంటారు.

ఇక మిగతా మూడు అరుదైన వ్యాధులలో గౌచర్స్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధి వస్తే కాలేయం లేదా ప్లీహము పెరుగుదల, ఎముకల నొప్పి, అలసట లక్షణాలు ఉంటాయి. మూడోది ‘విల్సన్స్ వ్యాధి’. ఈ వ్యాధి కాలేయంలో రాగి పేరుకుపోవడానికి కారణమవుతుంది. అంతేకాదు మానసిక సమస్యలు కూడా కనిపిస్తాయి. ఇక నాలుగవ అరుదైన వ్యాధి పేరు డ్రావెట్/లెనాక్స్ గాస్టాట్ సిండ్రోమ్. శరీరంలో అత్యంత సంక్లిష్టమైన సిండ్రోమ్‌ల యాక్టివిటీకి దారితీస్తుంది.

గౌచర్స్ వ్యాధి చికిత్సలో వాడే ఎలిగ్లుస్టాట్ క్యాప్సూల్స్‌ ఖర్చు ఏడాదికి రూ.1.8-3.6 కోట్ల మధ్య ఉండేది. భారతీయ ఔషధ కంపెనీల కృషితో ఇప్పుడు రూ.3.6 లక్షలకే అందుబాటులోకి వచ్చింది. విల్సన్స్ వ్యాధిలో ట్రియంటైన్ క్యాప్సూల్స్‌కు ఏడాదికి రూ.2.2 కోట్లు ఖర్చయ్యేది. ఇప్పుడది రూ. 2.2 లక్షలకే దిగివచ్చింది. ఇక డ్రావెట్ వ్యాధిలో వాడే కన్నబిడియోల్ ద్రావణానికి ఏడాదికి రూ. 7-34 లక్షల వరకు ఖర్చయ్యేది. ఇప్పుడు రూ. 1-5 లక్షలు ఉంటే సరిపోతుంది.

కాగా ఇండియాలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య పెద్దగానే ఉంది. ఈ వ్యాధులలో దాదాపు 80 శాతం జన్యుపరమైనవే కావడం గమనార్హం. పిల్లల్లో చిన్న వయస్సులోనే లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వీటికి చికిత్స చాలా ముఖ్యమైనది. ఈ వ్యాధులకు సంబంధించిన ఔషధాలను తక్కువ రేటుకే అందుబాటులోకి తీసుకురావాలని ఏడాది క్రితం భారతీయ ఔషధ కంపెనీలు సంకల్పించాయి. బయోఫోర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ (జెనారా ఫార్మా), లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, ఎంఎస్ఎన్ ఫార్మాస్యూటికల్స్, అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్‌తోపాటు పలు కంపెనీలు చౌకగా ఔషధాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేశాయి.

More Telugu News