State Election Commission: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు... పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఏమన్నారంటే..!

  • 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఓటర్లు 9.9 లక్షలు ఉన్నట్లు వెల్లడి
  • అసెంబ్లీ ఎన్నికల కోసం 36వేల ఈవీఎంలను సిద్ధం చేశామన్న వికాస్ రాజ్
  • 86 శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని వెల్లడి
EC Vikas Raj press conference on telangana election

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు, తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలకు 60 మంది పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు కలిగిన ఓటర్లు 9.9 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. సర్వీసు ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం 36వేల ఈవీఎంలను సిద్ధం చేశామన్నారు. ఈసారి కొత్తగా 51 లక్షల ఓటర్ కార్డులు ప్రింట్ చేసి తపాలా శాఖ ద్వారా పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మూడు కేటగిరీల వారికి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించామని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 9వేల మంది ఇంటి నుంచి ఓటు వేసినట్లు చెప్పారు. 86 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరు నియోజకవర్గాల్లో ఐదు వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందికి పోలింగ్ కేంద్రంలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వికాస్ రాజ్ వెల్లడించారు. ప్రతి కౌంటింగ్ సెంటర్‌కు పరిశీలకుడు ఉంటారన్నారు. తెలంగాణలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.

More Telugu News