Mohammed Shami: స్టార్ బౌలర్ మహ్మద్ షమీ గ్రామానికి వెళ్లిన జిల్లా అధికారులు.. ఎందుకో తెలుసా?

  • షమీ సొంత గ్రామం సహస్‌పూర్ అలీనగర్‌లో మినీ స్టేడియం, జిమ్
  • రాష్ట్రప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగం ప్రతిపాదన
  • సహస్‌పూర్ అలీనగర్‌ వెళ్లి స్థలాన్ని పరిశీలించిన అధికారుల బృందం
Cricketer Mohammed Shamis village to get mini stadium and gymnasium

వరల్డ్ కప్ 2023లో అత్యద్భుతంగా రాణిస్తున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ హీరోగా మారిపోయాడు. బౌలింగ్‌లో రాణిస్తున్న తీరుకు అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ముఖ్యంగా షమీ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఎంతలా అంటే షమీ పూర్వీకుల గ్రామం ‘సహస్‌పూర్ అలీనగర్’లో మినీ-స్టేడియాన్ని నిర్మించాలని అమ్రోహా జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేయాలని అధికారులు నిర్ణయించారు. స్టేడియంతోపాటు ఒక వ్యాయామశాలను ప్రారంభించాలని యోచిస్తున్నారు.

వరల్డ్ కప్‌లో షమీ అద్భుత ప్రదర్శన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయంపై అమ్రోహా జిల్లా కలెక్టర్ రాజేష్ త్యాగి స్పందించారు. గ్రామంలో మినీ స్టేడియం నిర్మాణానికి ఒక ప్రతిపాదనను పంపుతున్నామని, గ్రామంలో తగినంత భూమి ఉందని గుర్తించామని తెలిపారు. స్టేడియంతోపాటు జిమ్ కూడా ఉండాలని భావిస్తున్నట్టు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 స్టేడియాలను నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ జాబితాలో అమ్రోహా జిల్లా స్టేడియం కూడా ఉందని వివరించారు. స్టేడియం నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించేందుకు జిల్లా అధికారుల బృందం శుక్రవారం షమీ గ్రామం ‘సహస్‌పూర్ అలీనగర్’లో పర్యటించింది. 

మినీ స్టేడియం, వ్యాయామశాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించేందుకు శుక్రవారం డీఎం త్యాగి నేతృత్వంలోని బృందం షామి గ్రామాన్ని సందర్శించింది. దీంతో అక్కడ మినీ స్టేడియం నిర్మించడం దాదాపు ఖరారు అయ్యినట్టే. ఇదిలావుండగా ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని సహస్‌పూర్ అలీనగర్ పేసర్ మహ్మద్ షమీకి సొంత ఊరు. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా తుది జట్టులో చోటు సంపాదించుకున్న షమీ వరల్డ్ కప్‌ 2023లో ఎంత అద్భుతంగా రాణిస్తున్నాడో తెలిసిందే.

More Telugu News