Team India: టీమిండియా గెలుపుపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అభిప్రాయం ఇదే..!

  • భారత్ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అని అభినందనలు
  • టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని ప్రశంసలు
  • ఫైనల్‌లో వారిని ఆపడం చాలా కష్టమని విలియమ్సన్ హెచ్చరిక
India are the best team in world now says Kane willemson psnr

వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్లో బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్‌‌లో తనను ఓడించిన న్యూజిలాండ్‌ని టీమిండియా ఇప్పుడు మట్టికరిపించి, ప్రతీకారం తీర్చుకుని.. సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. అద్భుతంగా రాణించిన టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా భారత్ ఆటగాళ్లకు అభినందనలు తెలియజేశాడు.

ప్రస్తుతం టీమిండియా ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అని విలియమ్సన్ వ్యాఖ్యానించాడు. భారత్ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే ఫైనల్లో ఆపడం ఏ జట్టుకైనా కష్టతరమేనని అభిప్రాయపడ్డాడు. భారత ఆటగాళ్లు అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నారని, ఒక్క ఓటమి కూడా లేకుండా చెలరేగుతున్న ఆతిథ్య జట్టుని ఫైనల్లో ఆపడం అంత సులభం కాబోదని అన్నాడు. సెమీ-ఫైనల్‌లో టీమిండియా గెలుపు తర్వాత కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ ‘‘ సాధారణంగా వైఫల్యాలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో ఎలా వ్యవహరిస్తామనేది ముఖ్యం. కానీ టీమిండియా ఈ టోర్నీలో నిజంగా అద్భుతంగా ఆడుతోంది. కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్ చేరుకున్నారు. రౌండ్-రాబిన్‌ ప్రతి మ్యాచ్‌లోనూ అదరగొట్టారు. సెమీఫైనల్లోనూ అదే చేశారు. ఆత్మవిశ్వాసంతో ఫైనల్‌కు వెళ్లారనడంలో ఎలాంటి సందేహం లేదు.." అంటూ వ్యాఖ్యానించాడు.  

ఇదిలావుండగా సెమీఫైనల్ మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లి చారిత్రాత్మక 50వ వన్డే సెంచరీని నమోదు చేశాడు. మరో బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్, పేసర్ మహ్మద్ షమీ ఆల్-టైమ్ బెస్ట్ అద్భుత ప్రదర్శన చేశారు. మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేయగా 48.5 ఓవర్లలో 327 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్ అయ్యింది. 7 వికెట్లు పడగొట్టిన స్టార్ పేసర్ మహ్మద్ షమీ టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో వరల్డ్ కప్‌లో వరుసగా 10వ మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. దీంతో 70 పరుగుల తేడాతో ఓడిపోయిన కివీస్ ఇంటిదారి పట్టింది.

ఇదిలావుండగా 1983, 2011లలో భారత్ వన్డే వరల్డ్ కప్‌ని గెలుచుకోగా ఫైనల్ చేరుకోవడం ఇది నాలుగవ సారి. 2003లో భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఎవరితో తలపడబోతోందనేది గురువారం కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది.

More Telugu News