Hamas: హమాస్‌పై ఇజ్రాయెల్ కీలక ప్రకటన

  • గాజాపై హమాస్ పట్టుకోల్పోయిందని ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణమంత్రి
  • ఉగ్రవాదులు దక్షిణ దిశగా పారిపోతున్నారని వెల్లడి
  • హమాస్ స్థావరాలను పౌరులు దోచుకుంటున్నారని ప్రకటన
Hamas Has Lost Control In Gaza Says Israel

హమాస్ ఉగ్రవాదులను అంతమొందించడమే లక్ష్యంగా గాజాలో తీవ్ర స్థాయి దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ కీలకమైన విషయాన్ని వెల్లడించింది. గాజాలో హమాస్ పట్టుకోల్పోయిందని ప్రకటన చేసింది. ఉగ్రవాదులు దక్షిణ దిశగా పారిపోతున్నారని, హమాస్ స్థావరాలను అక్కడి పౌరులు దోచుకుంటున్నారని ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి గాలంట్ ప్రకటించారు. అక్కడి ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకంలేదని పేర్కొన్నారు. ఈ మేరకు గాలంట్ మాట్లాడిన వీడియో ఒకటి ఇజ్రాయెల్‌ ప్రధాన టీవీ ఛానళ్లలో ప్రసారమైంది. అయితే హమాస్ పట్టుకోల్పోయిందనే వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి ఆధారాలను చూపించలేదు. 

మరోవైపు.. ఉత్తర గాజాలో ఒక్క హాస్పిటల్ కూడా సేవలు అందించే పరిస్థితిలేదని గాజా స్ట్రిప్‌ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ యూసఫ్ అబు రిష్ ప్రకటించిన విషయం తెలిసిందే. గాజాలోని అతి పెద్దదైన అల్-షిఫా ఆసుపత్రిలో ఇటీవల ఏడుగురు శిశువులు, 27 మంది పెషెంట్లు చనిపోయారని అబూ రిష్ వెల్లడించారు. గాజా మొత్తాన్ని ఇజ్రాయెల్ బలగాలు ముట్టడించడంతో ఆహారం, ఇంధనం, ఇతర ప్రాథమిక సామగ్రికి తీవ్రమైన కొరత ఏర్పడింది. దీంతో పాలస్తీనా ప్రధాని మహ్మద్ సోమవారం రంగంలోకి దిగారు. సాయం కావాలంటూ యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్యసమితిలను కోరారు.

మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హమాస్ చెరలోని బందీలను విడిపించే ఒప్పందం దిశగా అడుగులు పడే అవకాశం ఉందన్నారు. అయితే ప్రణాళిక వివరాలను ఆయన బయటపెట్టలేదు. ఒప్పందం కుదిరేందుకు అవకాశం ఉందా? అని మీడియా ప్రశ్నించగా ఆయన ఈ విధంగా బదులిచ్చారు. ఇదిలావుండగా అక్టోబరు 7న ఇజ్రాయెల్‌‌లో హమాస్ భీకర నరమేధానికి పాల్పడిన విషయం తెలిసిందే. దాదాపు 1,200 మంది పౌరులను చంపేశారు. దాదాపు 240 మందిని బందీలుగా తీసుకున్న విషయం తెలిసిందే.

More Telugu News