Hyderabad: అమ్మాయిలూ.. బీ అలర్ట్! యువతులకు హైదరాబాద్ సీపీ హెచ్చరిక

  • సోషల్ మీడియా ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సందీప్ శాండిల్య
  • యువతుల ఫొటోలు, వీడియోలతో నిందితులు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నారని వెల్లడి
  • అపరిచితులతో చాటింగ్‌, ఫొటోలు, వీడియోల షేరింగ్ వద్దని సూచన
  • ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తక్షణం పోలీసులను సంప్రదించాలన్న శాండిల్య
Hyderabad CP alert youth about dangers in social media

సోషల్ మీడియాలో పొంచి ఉన్న ప్రమాదాలపై యువతులను హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు అమ్మాయిల ఫొటోలు, వీడియోలు సేకరించి, మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నారని తెలిపారు. అపరిచితులతో చాటింగ్ చేసి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతులకు సూచించారు. 

ఇటీవల జరిగిన రెండు ఉదంతాలను ప్రస్తావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఫేస్‌బుక్‌లో ఇద్దరు అమ్మాయిలను ట్రాప్ చేసిన నిందితులు వారిని బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేశారన్నారు. కాబట్టి, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్టులు వస్తే యాక్సెప్ట్ చేయవద్దన్నారు. లైక్స్, కామెంట్స్ మాయలో పడొద్దన్నారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేయొద్దని స్పష్టం చేశారు. దుండగులు వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతారని హెచ్చరించారు. 

వేధింపుల బారినపడ్డవారు వెంటనే పోలీసులను సంప్రదించాలని సీపీ సందీప్ శాండిల్య సూచించారు. పోలీసులను కుటుంబసభ్యులుగా భావించాలన్నారు. ‘‘ నా నెంబర్ 8712660001, పోలీస్ వాట్సాప్ నెంబర్ 9490616555. వీటికి సమాచారం ఇవ్వండి, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం’’ అని తెలిపారు. పిల్లలపై తల్లిదండ్రులు నిత్యం ఓ కన్నేసి ఉంచాలని కూడా ఆయన సూచించారు. తల్లిదండ్రులు బిజీగా ఉండి పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని పట్టించుకోలేకపోతున్నారని తెలిపారు. 

పోలీసుల ముఖ్య సూచనలు

  • వ్యక్తిగత ఫొటోలు ప్రొఫైల్ పిక్‌గా పెట్టొద్దు. ప్రొఫైల్‌ను కచ్చితంగా లాక్ చేయాలి.
  • గుర్తు తెలియని వ్యక్తుల ఫ్రెండ్  రిక్వెస్టులు యాక్సెప్ట్ చేయద్దు. 
  • ఇతర వ్యక్తులతో వీడియో కాల్స్ మాట్లాడొద్దు
  • వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు షేర్ చేయొద్దు
  • లైక్స్, కామెంట్స్ వలలో పడొద్దు 

More Telugu News