ఏపీ హైకోర్టు రోస్టర్లో కీలక మార్పులు
- కొత్తగా నలుగురు జడ్జిల రాకతో సబ్జెక్టుల కేటాయింపులో మార్పులు
- సమూల మార్పులు చేసిన సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్
- సోమవారం నుంచి అమల్లోకి కొత్త రోస్టర్
ఇక పురపాలక శాఖ, ఏపీసీఆర్డీఏ, ఏఎంఆర్డీఏ కేసులను జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, రెవెన్యూ, భూసేకరణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల కేసులను జస్టిస్ చీమలపాటి రవిలకు కేటాయించారు. ఇప్పటివరకు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి ఇకపై ఎఫ్ఐఆర్లు, ఛార్జిషీట్లను కొట్టివేయాలంటూ 2017 వరకు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్లపై పరిశీలించనున్నారు. అంతేకాదు 2018 నుంచి దాఖలైన క్రిమినల్ అప్పీళ్లను ఆయనే విచారిస్తారు.
జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయికి చార్జిషీట్లు, ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ 2020, 2021 సంవత్సరాల్లో దాఖలైన వ్యాజ్యాలను అప్పగించారు. ఇప్పటివరకు క్వాష్ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డికి 2017 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, కంపెనీ కేసులు, ఒరిజినల్ సివిల్ సూట్ల కేసుల బాధ్యతలు కేటాయించారు. కాగా ఈ రోస్టర్లో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. జడ్జిలు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ ట్రాన్స్ఫర్పై వేరే హైకోర్టులకు వెళ్తుండడమే ఇందుకు కారణంగా ఉంది. మరోవైపు కర్ణాటక హైకోర్టు నుంచి జస్టిస్ జీ.నరేంద్ర బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి తాజా రోస్టర్లో కొన్ని మార్పులు అనివార్యం కానుంది.