Etela Rajender: కేసీఆర్ నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారు.. మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఈటల హెచ్చరిక

  • బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌పై పోలీసుల దాడిని ఖండించిన ఈటల
  • కేసీఆర్ చెప్పుచేతల్లో పనిచేస్తున్న పోలీసులు బయటకు రావాలన్న బీజేపీ నేత
  • ఆత్మహత్యలు చేసుకుని కన్నవారికి కడుపుకోత మిగల్చొద్దన్న ఈటల రాజేందర్
BJP leader Etela Rajender Warns KCR Over Attack On Dr Laxman

బీజేపీ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గ్రూప్-2 పరీక్షలు రద్దు కావడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని, ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్‌ అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

విద్యార్థులు మానసికంగా కుంగిపోకుండా వారికి నైతిక స్థయిర్యాన్ని ఇవ్వడం బీజేపీ బాధ్యత అని, అందులో భాగంగా వారి వద్దకు వెళ్లిన వారిపై లాఠీ చార్జీ చేయడం తగదని అన్నారు. కేసీఆర్ కనుసన్నల్లో పనిచేస్తున్న పోలీసులు బయటకు రావాలని కోరారు. సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, కన్నవారికి కడుపుకోత మిగల్చవద్దని కోరారు. మంచి రోజులు వస్తాయని, పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే బాధ్యత తీసుకుంటామని ఈటల పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో ఉంటూ గ్రూప్స్‌కు ప్రిపేరవుతున్న వరంగల్ జిల్లా విద్యార్థిని ప్రవళిక నిన్న అశోక్‌నగర్‌లో తానుంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. విషయం తెలిసిన గ్రూప్స్ అభ్యర్థులు, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు అశోక్‌నగర్ చేరుకున్నారు. బాధిత విద్యార్థిని మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, అభ్యర్థులకు మధ్యతోపులాట జరిగింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చివరికి అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత ప్రవళిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

More Telugu News