New Zealand: వరల్డ్ కప్ లో ఎదురులేని న్యూజిలాండ్... మళ్లీ ఓడిన బంగ్లాదేశ్

  • న్యూజిలాండ్ కు వరుసగా మూడో విజయం
  • చెన్నైలో బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో జయభేరి
  • రాణించిన కెప్టెన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, కాన్వే
  • బంగ్లాదేశ్ కు టోర్నీలో రెండో ఓటమి
New Zealand registers third win in World Cup after beating Bangladesh by 8 wickets

వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ వరుసగా మూడో విజయం సాధించింది. ఇవాళ బంగ్లాదేశ్ తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన పోరులో న్యూజిలాండ్ ఆల్ రౌండ్ షో కనబర్చింది. బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

టాస్ ఓడిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసి, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు చేసింది. 246 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 42.5 ఓవర్లలో 2 వికెట్లకు ఛేదించారు. ఈ మ్యాచ్ తో జట్టులోకి పునరాగమనం చేసిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన స్థాయికి తగ్గట్టుగా ఆడి 78 పరుగులు సాధించాడు. విలియమ్సన్ స్కోరులో 8 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. అయితే, ఎడమ చేయి బొటనవేలికి గాయం కావడంతో విలియమ్సన్ రిటైర్డ్ హర్ట్ గా మైదానాన్ని వీడాడు.  

మరో ఎండ్ లో డారిల్ మిచెల్ అద్భుతంగా ఆడి 67 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్ లతో 89 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విలియమ్సన్ స్థానంలో బరిలో  దిగిన గ్లెన్ ఫిలిప్స్ 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 16 పరుగులు చేశాడు. అంతకుముందు, ఓపెనర్ డెవాన్ కాన్వే 45 పరుగులు చేయగా, యువ ఆటగాడు రచిన్ రవీంద్ర (9) నిరాశపరిచాడు. 

కాగా, టోర్నీలో బంగ్లాదేశ్ కు ఇది రెండో పరాజయం. తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పై నెగ్గిన బంగ్లాదేశ్... ఆ తర్వాత ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతిలో ఓడింది.

More Telugu News