వచ్చే నెల 9న గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్లు దాఖలు చేయనున్న కేసీఆర్
- కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయనున్న కేసీఆర్
- ఆ తర్వాత గజ్వేల్‌లో మొదటి, కామారెడ్డిలో రెండో నామినేషన్ దాఖలు
- ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం
- 15 నుంచి వరుసగా బహిరంగ సభలు
సీఎం కేసీఆర్ ఈ నెల 15న బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను అందిస్తారు. అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తారు. నాటి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. 15న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్ నియోజకవర్గంలో బహిరంగసభలో పాల్గొంటారు. ఆ తర్వాత 16న జనగామ, భువనగిరి కేంద్రాల్లో, 17న సిద్దిపేట, సిరిసిల్లలలో జరిగే సభలకు హాజరవుతారు. 18న మధ్యాహ్నం రెండు గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే సమావేశంలో, సాయంత్రం నాలుగు గంటలకు మేడ్చల్‌లో జరిగే సభకు హాజరవుతారు.