Team India: చెన్నై పిచ్ పై ఆసీస్ కు చుక్కలు కనపడ్డాయి... టీమిండియా ముందు ఈజీ టార్గెట్

  • వరల్డ్ కప్ లో నేడు భారత్ × ఆస్ట్రేలియా
  • చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 
  • 49.3 ఓవర్లలో 199 ఆలౌట్
  • జడేజాకు 3 వికెట్లు
Team India bundles Aussies for 199 runs

వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ను టీమిండియా బౌలర్లు హడలెత్తించారు. 

వార్నర్, స్మిత్ క్రీజులో ఉన్నప్పుడు ఫర్వాలేదనిపించిన ఆసీస్ బ్యాటింగ్... ఆ తర్వాత పడుతూ లేస్తూ సాగింది. చివరికి ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు కంగారూలు ఆపసోపాలు పడ్డారు. ముఖ్యంగా, రవీంద్ర జడేజా లెఫ్టార్మ్ స్పిన్ ను ఆడలేక వికెట్లు అప్పగించి వెనుదిరిగారు. స్టీవ్ స్మిత్ (46), మార్నస్ లబుషేన్ (27) వంటి అగ్రశ్రేణి బ్యాట్స్ మెన్ సైతం జడేజా స్పిన్ ఉచ్చులో పడ్డారు. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (0) అయితే జడేజా ధాటికి ఖాతానే తెరవలేకపోయాడు. 

జడేజాకు తోడు కుల్దీప్, అశ్విన్ కూడా రాణించడంతో ఆసీస్ బ్యాట్స్ మెన్ ఏ దశలోనూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయారు. చివర్లో మిచెల్ స్టార్క్ (28) కాస్త పోరాడడంతో ఆసీస్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. మిచెల్ మార్ష్ (0), మ్యాక్స్ వెల్ (15), కామెరాన్ గ్రీన్ (8) విఫలమయ్యారు. 

టీమిండియా బౌలర్లలో  జడేజా 3, కుల్దీప్ యాదవ్ 2, బుమ్రా 2, అశ్విన్ 1, సిరాజ్ 1, హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీశారు. టీమిండియాలో బౌలింగ్ చేసిన ప్రతి ఒక్కరికీ వికెట్ దక్కింది.

More Telugu News