Malagundla Sankaranarayana: వైసీపీ ఎమ్మెల్యే శంకర నారాయణ కాన్వాయ్ పై డిటొనేటర్ దాడి... తప్పిన ముప్పు

  • శ్రీ సత్యసాయి జిల్లాలో ఘటన
  • గడప గడపకు కార్యక్రమానికి వెళ్లిన ఎమ్యెల్యే
  • కాన్వాయ్ పై విసిరిన డిటొనేటర్ పొలంలో పడిన వైనం
  • పేలని డిటొనేటర్... పేలితే ఘోర ప్రమాదం జరిగుండేదన్న ఎమ్మెల్యే
Detonator attack on YCP MLA Sankara Narayana

పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే శంకర నారాయణకు ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్ పై డిటొనేటర్ దాడి జరిగింది. అసలేం జరిగిందంటే... శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధిలో ఇవాళ శంకర నారాయణ 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన తన వాహనం దిగి నడక ప్రారంభించారు. 

ఇంతలో ఓ వ్యక్తి ఎమ్మెల్యే కాన్వాయ్ పై డిటొనేటర్ విసిరాడు. అయితే, ఆ డిటొనేటర్ పక్కనే ఉన్న పొలాల్లో పడింది. పైగా అది పేలలేదు. వెంటనే వైసీపీ నేతలు ఆ డిటొనేటర్ విసిరిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ ఎలక్ట్రికల్ డిటొనేటర్ కు పవర్ సప్లై లేకపోవడంతో అది పేలలేదని గుర్తించారు. 

దీనిపై గోరంట్ల సీఐడీ సుబ్బరాయుడు స్పందించారు. నిందితుడు సోమందేపల్లి మండలం గుడిపల్లి వాసి గణేశ్ గా గుర్తించామని తెలిపారు. మద్యం మత్తులో డిటొనేటర్ విసిరినట్టు భావిస్తున్నామని వెల్లడించారు. 

ఈ ఘటన పట్ల ఎమ్మెల్యే శంకర నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది హత్యాయత్నమేనని ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారో తేలాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో తనకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. డిటొనేటర్ పేలకపోవడంతో  ముప్పు తప్పిందని అన్నారు.

More Telugu News