woman fingers: తెగిపోయిన నాలుగు వేళ్లను తిరిగి అతికించడానికి 12 గంటల పాటు సర్జరీ

  • బెంగళూరులోని హస్మత్ హాస్పిటల్ లో అరుదైన సర్జరీ
  • నాలుగు వేళ్లు తెగిపోవడం అరుదైనదిగా పేర్కొన్న వైద్యులు
  • మూడు నెలలకు తిరిగి సాధారణ పరిస్థితి
Bengaluru doctors reattach 4 of woman fingers in 12 hour surgery

బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఓ మహిళా రైతు నాలుగు వేళ్లు మెషిన్ లో పడి తెగిపోయాయి. వీటిని ఆమెకు తిరిగి అతికించడానికి వైద్యులకు 12 గంటల సమయం పట్టింది. కోలార్ సమీపంలోని వీరపుర గ్రామానికి చెందిన మంజుల (44) తన ఆవులకు మేత వేసేందుకు వీలుగా.. గడ్డిని మెషిన్ లో వేసి కట్ చేస్తోంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ ఆమె ఎడమ చేయి మెషిన్ లో చిక్కుకుని నాలుగు వేళ్లు తెగి పడిపోయాయి.

వెంటనే కుటుంబ సభ్యులు తెగిన వేళ్లతో ఆమెను కోలార్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం బెంగళూరులోని హస్మత్ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆమెను హస్మత్ ఆస్పత్రిలో చేర్చారు. మొత్తం మీద నాలుగు గంటల్లోపే ఆమెను తీసుకెళ్లారు. వైద్యులు సర్జరీకి ఏర్పాట్లు చేశారు. తెగిన వేళ్లను మైక్రోస్కోపీ కింద పెట్టి పరిశీలించారు. చేతి వేళ్లల్లో రక్త నాళాలు సాధారణంగా దారం అంత ఉంటాయి. మొత్తం మీద 12 గంటల సర్జరీలో ధమనులు, సిరలు, నాడులను అతికించి, విరిగిన వేలి ఎముకల మధ్య సర్జికల్ వైర్లతో అనుసంధానం చేసినట్టు హస్మత్ హాస్పిటల్ చైర్మన్ థామస్ డాక్టర్ చాందీ వెల్లడించారు. 

ఈ నెల 1న ఆమెకు సర్జరీ చేయగా, శుక్రవారం (6వ తేదీ) ఆమెను డిశ్చార్జ్ చేశారు. రెండు నుంచి మూడు నెలల్లో తిరిగి తెగిన వేళ్లతో సాధారణ పనులు చేసుకోవచ్చని వైద్యులు తెలిపారు. చేతికి ఉన్న ఐదు వేళ్లలో నాలుగు తెగిపోవడం అన్నది చాలా అరుదు అని డాక్టర్ థామస్ చాందీ తెలిపారు. తిరిగి విజయవంతంగా అతికించడం కూడా అరుదైన విషయంగా చెప్పారు. ఎప్పుడైనా వేళ్లు తెగిపోయినప్పుడు వెంటనే వాటిని ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టి, చుట్టూ ఐస్ క్యూబ్ లు వేసి, హాస్పిటల్ కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

More Telugu News