Russia: భారత్ ను మాకు దూరం చేయాలని చూస్తున్నారు: పుతిన్

  • పాశ్చాత్య దేశాలు చేస్తున్న ఈ ప్రయత్నం వృథాయేనన్న రష్యా అధ్యక్షుడు
  • ఇండియా నాయకత్వం స్వతంత్రంగా వ్యవహరిస్తోందని మెచ్చుకున్న పుతిన్
  • దేశ ప్రయోజనాలకే మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని కితాబు
Attempts To Turn India Away Pointless says Putin

పాశ్చాత్య దేశాలు తమ గుత్తాధిపత్యాన్ని ప్రపంచం మొత్తం ఆమోదించాలని భావిస్తున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శించారు. దీనికి అభ్యంతరం చెప్పిన దేశాలను శత్రు దేశాలుగా చూస్తాయని, తమతో పాటు మిగతా దేశాలు కూడా వాటిని శత్రువులుగానే ట్రీట్ చేయాలని భావిస్తాయని ఆరోపించారు. ఇందులో భాగంగానే భారతదేశాన్ని రష్యాకు దూరం చేసే ప్రయత్నం చేశాయంటూ పాశ్చాత్య దేశాలపై పుతిన్ మండిపడ్డారు.

అయితే, భారత దేశంలో ప్రస్తుతం ఉన్న మోదీ ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరిస్తోందని పుతిన్ ప్రశంసించారు. పాశ్చాత్య దేశాల ఉచ్చులో పడకుండా తమ సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తోందని మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా, రష్యాలను దూరం చేయాలనే ప్రయత్నాలు అర్థం లేనివని పుతిన్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ తో యుద్ధం మొదలయ్యాక రష్యాపై పాశ్చాత్య దేశాలు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఆంక్షలను లెక్కచేయకుండా భారత ప్రభుత్వం రష్యాతో ఆయిల్ డీల్ కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజా వ్యాఖ్యలు చేశారు.

More Telugu News