G. Kishan Reddy: ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణ.. గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించిన కిషన్ రెడ్డి

  • నామినేటెడ్ కోటాలో కవులు, కళాకారులు, సేవ చేసే వారికి ఇవ్వాలన్న కిషన్ రెడ్డి
  • కేసీఆర్ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను సభకు పంపించే ప్రయత్నమని ఆగ్రహం
  • కేసీఆర్ కుటుంబానికి సేవచేసే వారిని గవర్నర్ తిరస్కరించడం స్వాగతించాల్సిందేనని వ్యాఖ్య
Kishan Reddy welcomes governor tamilsai decision

గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వాగతించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను ప్రభుత్వం గవర్నర్ కోటా కింద సిఫార్సు చేసింది. అయితే వారు ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టలేదని, రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని అందుకే తిరస్కరించానని గవర్నర్ చెప్పారు. సామాజిక సేవ చేసే వారిని ప్రతిపాదిస్తే ఆమోదిస్తానని స్పష్టం చేశారు. ఈ అంశంపై కిషన్ రెడ్డి స్పందించారు.

నామినేటెడ్ కోటాలో కవులు, కళాకారులు, సేవ చేసేవారికి అవకాశం కల్పిస్తారని తెలిపారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను పెద్దల సభకు పంపించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం కోసం పని చేసేవారికి ఎమ్మెల్సీ పదవి అడుగుతున్నారన్నారు. పార్టీలు పదేపదే ఫిరాయించిన వారికి, కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వారిని గవర్నర్ తిరస్కరించడం స్వాగతించాల్సిందే అన్నారు. కేసీఆర్ ఏం చెబితే అది వింటే మంచివాళ్లు, లేకుంటే చెడ్డవాళ్లా? అని ప్రశ్నించారు.

More Telugu News