Akasa Airlines: ఆకాశ ఎయిర్‌లైన్స్ మూసేస్తారంటూ వదంతులు.. ఖండించిన సీఈఓ

  • గత కొన్ని నెలలుగా పైలట్ల ఆకస్మిక రాజీనామాలతో చిక్కుల్లో ఆకాశ ఎయిర్‌లైన్స్
  • చివరి నిమిషంలో  విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణికులకు ఇబ్బందులు
  • సంస్థను మూసేస్తారంటూ మొదలైన వదంతులు, ఉద్యోగుల్లో టెన్షన్
  • అలాంటి ప్రసక్తే లేదని సంస్థ సీఈఓ భరోసా
  • పరిస్థితిని దీటుగా ఎదుర్కొనేందుకు సర్వీసులను స్వచ్ఛందంగా తగ్గించుకున్నామని వెల్లడి
Akasa Airlines CEO dismisses shutdown rumours

పైలట్ల అకస్మిక రాజీనామాలతో చిక్కుల్లో పడ్డ ఆకాశ ఎయిర్‌లైన్స్‌ను మూసేస్తారంటూ వస్తున్న వదంతులను సంస్థ సీఈఓ వినయ్ దూబే తాజాగా ఖండించారు. ‘ఆకాశ’ను మూసివేసే ప్రసక్తే లేదని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. సుదీర్ఘకాలం పాటు ప్రయాణికులకు సేవలందించేందుకే సంస్థను స్థాపించామని పేర్కొన్నారు. ఈ మేరకు ఉద్యోగులకు ఆయన ఈ-మెయిల్ చేశారు. 

ఇటీవల కాలంలో ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన పలువురు పైలట్లు అకస్మాత్తుగా రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. రిజైన్ చేస్తున్నట్టు ప్రకటించాక నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పీరియడ్ మేరకు ‘ఆకాశ’లో ఉండకుండా ఇతర సంస్థల్లో చేరిపోయారు. దీంతో, గత కొన్ని నెలలుగా ఆకాశ ఎయిర్‌లైన్స్ అనేక ఫ్లైట్లను చివరి నిమిషంలో రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తమకు పరిహారం చెల్లించాలంటూ 43 మంది పైలట్లపై ఆకాశ ఎయిర్‌లైన్స్ కోర్టులో కేసు కూడా వేసింది. 

అయితే, పైలట్ల ఆకస్మిక రాజీనామాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని వినయ్ దూబే అంగీకరించారు. ప్రయాణికులు ఇబ్బందుల పాలు కాకుండా ఉండేందుకు కార్యకలాపాలను తగ్గించుకున్నామని వెల్లడించారు. ఈ మేరకు మార్కెట్‌లో వాటాను స్వచ్ఛందంగా వదులుకున్నామని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో మరింత విశ్వసనీయ సేవలు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కంపెనీ విజయపథాన నడుస్తుందని తాము గట్టినమ్మకంతో ఉన్నట్టు పేర్కొన్నారు. క్రమశిక్షణతో కూడుకున్న తమ విధానాల కారణంగా సంస్థ ఆర్థికంగా బలంగా, భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతంగా అమలు చేసే స్థితిలో ఉందని స్పష్టం చేశారు.

More Telugu News