Nawaz Sharif: భారత్ చందమామను చేరుకుంటే, పాకిస్థాన్ ప్రపంచదేశాల ముందు అడుక్కుతింటోంది: నవాజ్ షరీఫ్

  • ప్రవాసంలో ఉన్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
  • వీడియో లింక్ ద్వారా లాహోర్ లోని కార్యకర్తలతో సమావేశం
  • జీ20 సదస్సుతో భారత్ ప్రతిష్ఠ మరింత పెరిగిందన్న షరీఫ్
  • పాకిస్థాన్ అప్పుల కోసం దేబిరిస్తోందని వెల్లడి
Nawaz Sharif praises India and criticize Pakistan

అనేక కేసులు ఎదుర్కొంటూ, అనారోగ్య కారణాలు చెప్పి దేశం విడిచి వెళ్లిపోయిన పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లండన్ లో ప్రవాసంలో ఉంటున్న నవాజ్ షరీఫ్... భారత్ పురోగమిస్తుంటే, పాకిస్థాన్ అంతకంతకు దిగజారుతోందని అన్నారు. భారత్ అభివృద్ది పథంలో దూసుకెళుతూ చందమామను చేరుకుందని, కానీ, పాకిస్థాన్ దయనీయస్థితిలో ప్రపంచ దేశాల ముందు చిల్లర పైసల కోసం అడుక్కుతింటోందని ఘాటుగా స్పందించారు. 

భారత్ జీ20 సదస్సు నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిష్ఠను మరింత పెంచుకుందని వివరించారు. పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభానికి మాజీ సైనిక జనరళ్లు, న్యాయమూర్తులే కారణమని షరీఫ్ ఆరోపించారు. 

"ఇవాళ పాకిస్థాన్ ప్రధాని ఆ దేశానికి, ఈ దేశానికి తిరుగుతూ నిధుల కోసం బిచ్చమెత్తుకుంటున్నారు. భారత్ ఇవాళ అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేస్తోంది. చంద్రుడ్ని అందుకుంది, జీ20 సమావేశాలకు ఆతిథ్యమిచ్చింది. భారత్ చేయగలిగింది పాకిస్థాన్ ఎందుకు చేయలేకపోతోంది? ఈ దారుణ పరిస్థితులకు ఎవరు బాధ్యులు?" అని సూటిగా ప్రశ్నించారు. 

లాహోర్ లోని పార్టీ కార్యకర్తలతో నవాజ్ షరీఫ్ లండన్ నుంచి వీడియో లింక్ ద్వారా సమావేశమయ్యారు. "అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధాని అయినప్పుడు భారత్ వద్ద రూ.8,332 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఇవాళ భారత్ వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యం విలువ రూ.49 లక్షల కోట్లు" అని వివరించారు.

More Telugu News