TDP: రిమాండ్ రిపోర్ట్ లో చంద్రబాబుపై ఆరోపణలు... ప్రతి ఆరోపణకు బదులిచ్చిన టీడీపీ

  • స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్
  • 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
  • కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించిన సీఐడీ
  • చంద్రబాబుపై ఆరోపణలతో రిమాండ్ రిపోర్టు
  • కౌంటర్ ఇచ్చిన టీడీపీ
TDP replies to CID allegations on Chandrababu

స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబుపై ఏపీ సీఐడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధాలని టీడీపీ అంటోంది. రాజకీయ కక్ష సాధింపు కోసం ఏపీ సీఐడీ ఒక ప్రైవేటు సైన్యంలా తయారైందని మండిపడింది. అసందర్భ ప్రేలాపనలతో కూడిన రిమాండ్ రిపోర్టును సీఐడీ నిన్న కోర్టులో దాఖలు చేసిందని టీడీపీ విమర్శించింది. కుట్రపూరితంగా ఫోర్జరీ డాక్యుమెంట్లతో కాంట్రాక్టులు కుదుర్చుకుని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దోచుకున్నారన్నది ఆ ఆరోపణల సారాంశం అని వివరించింది. 

అసలు జరిగింది ఏంటంటే... 2013లో గుజరాత్ లో తీసుకువచ్చిన ప్రాజెక్టును రాష్ట్ర అధికారులు అధ్యయనం చేసి సిఫారసు చేసిన అనంతరం 2015లో మన రాష్ట్రంలోనూ తీసుకురావడం జరిగిందని టీడీపీ వెల్లడించింది. 

గుజరాత్ తో పాటు 8 రాష్ట్రాల్లో పనిచేస్తున్న సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్  వేర్ ఇండియా (సీమెన్స్ సాఫ్ట్ వేర్), డిజైన్ టెక్ సంస్థలతో గుజరాత్ లో అమలు చేస్తున్న షరతుల ప్రకారమే నాటి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని తెలిపింది. 

ఇందులో 42 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారని, నిధుల దుర్వినియోగం జరగలేదని, 2.13 లక్షల మంది విద్యార్థులు నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందారని... ఈడీ అరెస్ట్ చేసిన సీమెన్స్, డిజైన్ టెక్ వ్యక్తులకు బెయిల్ ఇచ్చే సమయంలో ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించిందని టీడీపీ గుర్తుచేసింది. 

ఈ క్రమంలో టీడీపీ... సీఐడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ప్రతి ఆరోపణకు తగిన ఆధారాలతో సమాధానమిచ్చింది.

More Telugu News