BJP: ఉప ఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు

  • ఆరు రాష్ట్రాల్లోని ఏడు స్థానాలకు ఓట్ల లెక్కింపు
  • త్రిపురలోని రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల విజయం
  • మరో స్థానంలో బీజేపీ అభ్యర్థి ముందంజ
  • కాంగ్రెస్ రెండు చోట్ల, ఎస్పీ, జేఎంఎం ఒక్కో స్థానంలో ఆధిక్యం
bjp lead in by polls

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి. ఆరు రాష్ట్రాల్లో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు వ్యతిరేకంగా జట్టుకట్టిన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కి ఈ ఉప ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయి. ఈ ఏడాది చివర్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల పట్ల ఆసక్తి నెలకొంది.

త్రిపుర రాష్ట్రంలోని ధన్ పూర్, బోక్సానగర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ రెండు చోట్ల మొదటి రౌండ్ నుంచి బీజేపీ అభ్యర్థులే ఆధిక్యం కొనసాగించారు. బోక్సానగర్ లో 66 శాతం మైనారిటీ ఓట్లు ఉన్న చోట బీజేపీ గెలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక్కడి సీపీఎం ఎమ్మెల్యే శామ్ సుల్ హక్ మరణంతో ఉప ఎన్నిక జరిగింది. బీజేపీ అభ్యర్థి తఫజ్జల్ హుస్సేయిన్ కు 34,146 ఓట్లు రాగా, సీపీఎం అభ్యర్థి మిజాన్ హుస్సేయిన్ కు 3,909 ఓట్లే దక్కాయి. ధన్ పూర్ లో సీపీఎం అభ్యర్థి కౌశిక్ చంద్రను బీజేపీ అభ్యర్థి బిందు దేవ్ నాథ్ ఓడించారు. దేవ్ నాథ్ కు 30,017 ఓట్లు రాగా, కౌశిక్ చంద్రకు కేవలం 11,146 ఓట్లు పోలయ్యాయి. 

పశ్చిమబెంగాల్లోని ధూప్ గురిలో బీజేపీ అభ్యర్థి తపసి రాయ్ 1,500 ఓట్లతో తృణమూల్ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఘోసి స్థానంలో ఎస్పీ అభ్యర్థి సుధాకర్ సింగ్ బీజేపీ అభ్యర్థి దారా సింగ్ చౌహాన్ పై 4,067 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఉత్తరాఖండ్ లోని భాగేశ్వర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బసంత్ కుమార్ సుమారు 700 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. కేరళలోని పుత్తుపల్లి స్థానంలో కాంగ్రెస్ తరఫున చాందీ ఊమెన్ 2816 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. ఝార్ఖండ్ లోని దుమ్రి స్థానంలో జేఎంఎం అభ్యర్థి బేబీ దేవి 1,341 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.

More Telugu News