వంద కుటుంబాలకు కోటి రూపాయలు పంచుతా: విజయ్ దేవరకొండ

  • హిట్ టాక్ తో దూసుకెళుతున్న ఖుషి
  • విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో చిత్రం
  • సెప్టెంబరు 1న రిలీజ్
  • విశాఖపట్నంలో విజయోత్సవ వేడుకలు
  • హాజరైన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి చిత్రం ప్రజాదరణ పొందడంతో చిత్రబృందం ఆనందంతో పొంగిపోతోంది. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు విశాఖపట్నంలో నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర ప్రకటన చేశారు. వంద కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాగా డబ్బు సంపాదించి తల్లిదండ్రులను సంతోషపెట్టాలని అనుకునేవాడ్నని, సమాజంలో గౌరవం లభించాలని కోరుకునేవాడ్నని తెలిపారు. ఇప్పటివరకు తనకు స్ఫూర్తినిచ్చే అంశాలు ఇవేనని, కానీ ఇప్పటినుంచి అభిమానుల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. 

ఖుషి సినిమా ఇవాళ ఫేక్ రివ్యూలను, తప్పుడు ప్రచారాన్ని అధిగమించి విజయవంతంగా ప్రదర్శితమవుతోందంటే అందుకు కారణం అభిమానులేనని విజయ్ దేవరకొండ అన్నారు. కొందరు డబ్బులిచ్చి మరీ ఖుషి చిత్రంపై వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారని కానీ అభిమానుల ప్రేమ ముందు అవేవీ పనిచేయలేదని వివరించారు. 

అభిమానుల ముఖాల్లో ఆనందం చూడాలన్న కోరిక ఈ సినిమాతో తీరిందని, ప్రతి ఒక్కరితో ఆనందం పంచుకోవాలని ఉన్నా అది వీలయ్యే పని కాదని అన్నారు. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష ఇస్తానని విజయ్ ప్రకటన చేశారు. ఈ మొత్తాన్ని వారికి మరో వారం, పది రోజుల్లో అందిస్తానని అన్నారు. 

నా ఆనందమే కాదు, నా సంపాదనను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను అని తెలిపారు. మనమంతా ఇక ఒకే ఫ్యామిలీ అంటూ విజయ్ దేవరకొండ భావోద్వేగాలకు లోనయ్యారు.

Vijay Devarakonda
Fans
Khushi
Success Celebrations
Vizag

More Telugu News