Yevgeny Prigozhin: ప్రమాదాలు పొంచి ఉన్నాయని ప్రిగోజిన్ ను ముందే హెచ్చరించాం: బెలారస్ అధ్యక్షుడు

  • రష్యా అధ్యక్షుడు పుతిన్ పై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు
  • నాయకత్వం వహించిన ప్రిగోజిన్
  • బెలారస్ మధ్యవర్తిత్వంతో ముగిసిన సంక్షోభం
  • అజ్ఞాతంలో ప్రిగోజిన్
  • ఇటీవల అనూహ్యరీతిలో విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ మృత్యువాత
Belarus President says he warned Prigozhin twice

ఒకప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు నమ్మినబంటుగా గుర్తింపు పొంది, ఆపై తిరుగుబాటు చేసిన వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్ గెనీ ప్రిగోజిన్... చివరికి విమాన ప్రమాదంలో కన్నుమూయడం తెలిసిందే. 

పుతిన్ కు ఎదురు తిరిగిన క్షణమే, ప్రిగోజిన్ మరణం తప్పదంటూ అభిప్రాయాలు వెలువడ్డాయి. ఊహాగానాలనే నిజం చేస్తూ ప్రిగోజిన్ అనూహ్య రీతిలో సొంత విమానంలో ప్రయాణిస్తూ మృత్యువాతపడ్డారు. ఆ విమానం ఎందుకు కూలిపోయిందన్నది ఇంకా తెలియరాలేదు. 

దీనిపై బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లూకాషెంకో స్పందించారు. ప్రిగోజిన్ ను తాను రెండుసార్లు హెచ్చరించానని తెలిపారు. ప్రమాదాలు పొంచి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశానని లూకాషెంకో వివరించారు. 

"మాస్కో దిశగా వాగ్నర్ దళాలు కదం తొక్కుతున్న సమయంలో తొలిసారిగా ప్రిగోజిన్ ను ఫోన్ లో హెచ్చరించాను. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. యెవ్ గెనీ నీకు అర్థమవుతోందా? నీ వాళ్లను నువ్వే పాతాళంలోకి నెట్టేస్తున్నావు... నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు అని అతడికి చెప్పాను. దాంతో అతడు... చస్తానేమో, అంతకుమించి ఏమవుతుంది? అంటూ సమాధానమిచ్చాడు" అని లూకాషెంకో వెల్లడించారు. 

ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా రష్యా సైన్యం తమకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, ఆయుధాలను కూడా తగినన్ని అందించడంలేదని వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ గత జూన్ లో ఆరోపించారు. వాగ్నర్ గ్రూప్ లో ఈ మేరకు తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో ప్రిగోజిన్ నాయకత్వంలో జూన్ 23న తిరుగుబాటు చోటుచేసుకుంది. 

అయితే వాగ్నర్ దళాలు మాస్కో చేరకముందే, బెలారస్ ప్రభుత్వ మధ్యవర్తిగా వ్యవహరించి రాజీ చేయడంతో తిరుగుబాటు సమసిపోయింది. మార్గ మధ్యం నుంచే వాగ్నర్ దళాలు వెనుదిరిగాయి. అప్పటినుంచి ప్రిగోజిన్ బెలారస్ లో అజ్ఞాతంలో ఉన్నారు. 

ఇటీవల మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళుతుండగా, ఆయన ప్రయాణిస్తున్న విమానం ట్వెర్ ప్రాంతంలో కూలిపోయింది. ప్రిగోజిన్ సహా విమానంలో ఉన్న 10 మంది దుర్మరణం పాలయ్యారు.

More Telugu News