'ఆయుష్మాన్ భారత్'లో మృతులకు చికిత్సపై స్పందించిన కేంద్రం
- గతంలోనే చనిపోయిన 3,446 మందికి చికిత్స అందించినట్టు వార్తలు
- జన్ ఆరోగ్య యోజనలో రూ. 7 కోట్ల అక్రమాలు జరిగాయంటూ కాగ్ నివేదిక
- ఆ వార్తల్లో నిజం లేదన్న కేంద్రం
- మీడియా కథనాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆగ్రహం
జన్ ఆరోగ్య యోజన పథకం కింద గతంలో చనిపోయిన 3,446 మంది రోగులకు చికిత్స అందించినట్టు పేర్కొంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవల ఓ నివేదికను విడుదల చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆసుపత్రులు సమర్పించిన క్లెయిములను పరిశీలిస్తే గతంలో చనిపోయిన 3,446 మంది రోగులకు కూడా చికిత్స అందించినట్టు తేలిందని ఆ నివేదికలో కాగ్ పేర్కొంది.
ఇలాంటి క్లెయిములు కేరళలో అత్యధికంగా ఉండగా, ఛత్తీస్గఢ్, హర్యానా రాష్ట్రాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్టు తెలిపింది. కాగా, ఆయుష్మాన్ అమలు తీరుపై ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో కాగ్ నివేదికను పార్లమెంటు ముందు ఉంచినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది. కాగ్ ప్రతిపాదనలను పరిశీలించి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.