AAP: సంతకాల ఫోర్జరీ ఆరోపణలు: వీడియో విడుదల చేసిన ఎంపీ రాఘవ్ చద్దా

  • నమస్కారం అంటూ వీడియోను ప్రారంభించిన ఏఏపీ ఎంపీ
  • ఫోర్జరీ పేరుతో బురద జల్లుతున్నారని ఆవేదన
  • నేను అసలు విషయం చెప్పాలనుకుంటున్నానంటూ వివరణ
AAPs Raghav Chadha on being suspended from Rajya Sabha

ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను శుక్రవారం రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. ఫోర్జరీ ఆరోపణల నేపథ్యంలో ఆయన శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు. నమస్కారం.. అంటూ ఈ వీడియోను ప్రారంభించారు. తన ప్రతిష్టను దిగజార్చేందుకు ఫోర్జరీ పేరుతో బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సవాళ్లకు తాను భయపడేది లేదని, పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని చెప్పారు. ఇవాళ నన్ను రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారు. కానీ నేను ఏం నేరం చేశాను? అని ఆయన ప్రశ్నించారు. తాను కొంతమంది ఎంపీల సంతకాలను సేకరించానని బీజేపీ చెబుతోందని, మీకు అసలు విషయం చెప్పాలని భావిస్తున్నానని, ఏ పార్లమెంటేరియన్‌కు అయినా పేర్లను ప్రతిపాదించే హక్కు ఉంటుందని అన్నారు.

అంటే తాను సెలక్ట్ కమిటీకి పేర్లను ప్రతిపాదించగలనని, అలా చేయడానికి ఆ ఎంపీల సమ్మతి, సంతకం అవసరం లేదన్నారు. వారి పేర్లను ఇస్తే సరిపోతుందన్నారు. ఏ ఎంపీకి అయినా అందులో అభ్యంతరం ఉంటే తమ పేరును ఉపసంహరించుకోవచ్చునన్నారు. తాను ఎలాంటి సంతకాలను సమర్పించలేదని వెల్లడించారు. అసలు నేను చేసిన నేరం ఏమిటి? బీజేపీ నేతలను ప్రశ్నలు అడిగినందుకే సస్పెండ్ చేశారా? ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై నా అభిప్రాయాన్ని వెల్లడించి బీజేపీ నుండి న్యాయం కోరడమే నేను చేసిన నేరమా? అని వీడియోలో పేర్కొన్నారు.

More Telugu News