స్పీకర్లలో రూ.కోటి విలువైన బంగారం.. శంషాబాద్ లో పట్టుబడ్డ స్మగ్లర్లు
- జెడ్డా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికులు
- అధికారుల తనిఖీల్లో బయటపడ్డ 8 కిలోల బంగారం
- ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు
జెడ్డా నుంచి శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ విమానంలో బంగారం అక్రమ రవాణా జరుగుతోందని అధికారులకు అప్పటికే సమాచారం అందింది. దీంతో ప్రయాణికులను మరింత నిశితంగా పరిశీలించగా.. ఇద్దరు ప్రయాణికుల తీరు అనుమానాస్పదంగా కనిపించిందని అధికారులు చెప్పారు. వారు తీసుకొచ్చిన లగేజీని పరిశీలించగా.. ఐదు స్పీకర్లు, ఓ ఇస్త్రీ పెట్టెలో దాచిన 8 కిలోల బంగారం బయటపడింది. మార్కెట్లో దీని విలువ రూ.1.11 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు వివరించారు.