England: యాషెస్ కు అద్భుత ముగింపు... చివరి టెస్టు గెలిచి సిరీస్ సమం చేసిన ఇంగ్లండ్

  • ఓవల్ టెస్టులో 49 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విన్
  • చివరి రెండు వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్ కు ముగింపు పలికిన బ్రాడ్
  • యాషెస్ సిరీస్ 2-2తో సమం
  • ఈ టెస్టుతో క్రికెట్ కు వీడ్కోలు పలికిన బ్రాడ్
England won final test and equals Ashes

ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్థాన్, ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ లను యుద్ధాలు అనడంలో అతిశయోక్తి లేదు. యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ ముగిసిన చివరి టెస్టే అందుకు నిదర్శనం. 

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ 49 పరుగులతో విజయం సాధించింది. తద్వారా 5 టెస్టుల ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ ను 2-2తో సమం చేసింది. చివరి సెషన్ లో హీరో అంటే స్టూవర్ట్ బ్రాడ్ అని చెప్పాలి. ఈ టెస్టుతో క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఈ ఇంగ్లండ్ పేసర్ తన కెరీర్ చివరి టెస్టును చిరస్మరణీయం చేసుకున్నాడు. ఆసీస్ లైనప్ లోని చివరి రెండు వికెట్లను బ్రాడ్ పడగొట్టాడు. 

384 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన ఆసీస్... ఆటకు ఆఖరి రోజున రెండో ఇన్నింగ్స్ లో 334 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లతో ఆసీస్ ను దెబ్బతీయగా, మొయిన్ అలీ తన స్పిన్ మ్యాజిక్ ప్రదర్శించి 3 వికెట్లు సాధించాడు. మార్క్ ఉడ్ కు 1 వికెట్ దక్కింది. 

లండన్ లోని ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 283 పరుగులు చేయగా, ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 295 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 395 పరుగులు చేసిన ఆతిథ్య ఇంగ్లండ్... ఆసీస్ ముందు 384 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్యఛేదనలో ఆసీస్ కు శుభారంభం లభించినా, కీలక భాగస్వామ్యాలు కొరవడడంతో మ్యాచ్ లో ఓటమి తప్పలేదు. 

ఈ సిరీస్ లో తొలి రెండు టెస్టులను ఆసీస్ గెలవగా, మూడో టెస్టు గెలిచిన ఇంగ్లండ్ మళ్లీ రేసులోకి వచ్చింది. నాలుగో టెస్టులో వరుణుడి కారణంగా విజయం దూరం అయినప్పటికీ, చివరి టెస్టులో పోరాట పటిమ ప్రదర్శించిన ఇంగ్లండ్ అపురూప విజయాన్ని అందుకుంది.

అయితే, సిరీస్ డ్రా కావడంతో యాషెస్ కప్ ఆసీస్ వద్దనే ఉండనుంది. ఎందుకంటే, గత సిరీస్ విజేత ఆస్ట్రేలియానే.

More Telugu News