Raghu Rama Krishna Raju: ఉదయం లేవగానే దుర్వార్త విన్నా: రఘురామకృష్ణ రాజు

  • విశాఖలో వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేశాడని రఘురాజు ఆవేదన
  • ఈ హత్యకు జగన్ తో పాటు తామంతా బాధ్యులమేనని వ్యాఖ్య
  • వాలంటరీ వ్యవస్థను క్యాన్సర్ మాదిరి జగన్ ప్రవేశపెట్టారని విమర్శ
I heard bad news after wake up this morning says Raghu Rama Krishna Raju

ఈ ఉదయం నిద్ర లేవగానే ఒక దుర్వార్తను వినాల్సి వచ్చిందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. విశాఖలో వరలక్ష్మి అనే వృద్ధురాలిని ఒక వాలంటీర్ హత్య చేశాడని చెప్పారు. బాధ్యత లేని వ్యక్తులను ఊర్లపైకి, ఇళ్ల మీదకు సీఎం జగన్ వదిలేశారని మండిపడ్డారు. ఈ హత్యలో తామంతా కూడా భాగస్వాములమేనని చెప్పారు. సీఎం జగన్ తో పాటు, ఎంపీలు కూడా బాధ్యులేనని అన్నారు. ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 


వాలంటీర్లు చేస్తున్న పని ఏమిటని రఘురాజు ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత డేటాను దొంగిలించడం తప్ప వారు చేస్తున్న పని ఏమీ లేదని విమర్శించారు. మహిళల ఫొటోలను కూడా వాలంటీర్లు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. పింఛన్ ను వార్డు మెంబర్ కూడా ఇవ్వొచ్చని లేదా పింఛన్ డబ్బులను అకౌంట్లలో వేయవచ్చని చెప్పారు. 

ఒక ఇంటి నంబర్ పై 500 దొంగ ఓట్లను నమోదు చేశారని... దొంగ ఓట్లు ఉన్న వారి పింఛన్ ఎవరెవరి అకౌంట్లలోకి వెళ్తోందని రఘురాజు ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రశ్నించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సిగ్గు లేకుండా ప్రభుత్వమే కేసు వేసిందని విమర్శించారు. వాలంటరీ వ్యవస్థను ఒక క్యాన్సర్ గడ్డ మాదిరి జగన్ ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. బాధ్యత లేని వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చినవారిని దొంగ అనాలా? అని ప్రశ్నించారు. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎందుకని అన్నారు.

More Telugu News