mango: ఈ మామిడిపళ్ల ఖరీదు కిలో రూ.3 లక్షలు... ప్రపంచంలోనే ఖరీదైన మామిడిని పండిస్తున్న రైతు

  • తన తోటలో మియాజాకి మామిడిని పండిస్తోన్న ఒడిశా రైతు  
  • అంతర్జాతీయ మార్కెట్ లో కిలో రూ.2.5 లక్షల నుండి రూ.3 లక్షలు
  • జపాన్ జాతికి చెందిన మియాజాకిలో రుచితో పాటు ఔషధ విలువలు
This Indian farmer grows worlds most expensive mango in his orchard

ఒడిశాలోని ఓ రైతు తన తోటలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లను పండించినట్లు చెప్పారు. ANI న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం... ఒడిశాలోని కలహండి జిల్లాలో గల తన తోటలో మియాజాకి మామిడిని పెంచుతున్నట్టు రైతు భోయ్ తెలిపారు. ముఖ్యంగా మియాజాకి మామిడి ప్రత్యేక రుచిని కలిగి ఉండటంతో పాటు పోషకాలను కూడా కలిగి వుంటుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మామిడి ధర కిలోకు రూ.2.5 లక్షల నుండి రూ.3 లక్షల వరకు ఉంటుంది. ఈ రైతు తన వ్యవసాయ భూమిలో వివిధ రకాల మామిడి పండ్లను పెంచుతున్నాడు. రాష్ట్ర ఉద్యానవన శాఖ ద్వారా విత్తనాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా తన తోటలో మియాజాకి రకాన్ని పెంచుతున్నాడు.

మియాజాకి రకం వాస్తవానికి జపనీస్ జాతి మామిడి. విలక్షణమైన రుచి, ఔషధ విలువల కోసం విదేశాలలో దీనికి భారీ డిమాండ్ ఉంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఈ మామిడి అసలు పేరు తైయో నో టమాగో. జపాన్ లోని మియాజాకిలో సాగు చేసిన ఈ పంటను ప్రపంచమంతా మియాజాకి అని పిలుస్తోంది. ప్రతి ఏప్రిల్‌లో మియాజాకి సెంట్రల్ హోల్‌సేల్ మార్కెట్‌లో నుండి మామిడి పండ్లను వేలం వేస్తారు. ఇటీవల, రాయ్‌పూర్, సిలిగురిలో జరిగిన మ్యాంగో ఫెస్టివల్‌లో మియాజాకి జాతి మామిడి పండ్లను ప్రదర్శించారు.

బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం... మియాజాకిలో పండించే మామిడి పండ్లు ఇర్విన్ మామిడి రకానికి చెందినవి. ఈ రకం పండినప్పుడు ఎర్రగా మారుతాయి కాబట్టి వీటిని యాపిల్ మామిడిగా పిలుస్తారు. ఇర్విన్ మామిడి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో సర్వసాధారణంగా ఉంటాయి. అలాగే వాటి ధరలు కూడా కాస్త తక్కువే. అయితే మియాజాకి మామిడితో ఏ రకమైన మామిడినీ పోల్చలేం. మియాజాకి సంరక్షణ కూడా అలా ఉంటుంది. ఉదాహరణకు దీనిని గ్రీన్ హౌస్ లో సజావుగా పెంచాలి. ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలి. గది వెంటిలేషన్ ఉండాలి. గాలిని తేమగా మార్చాలి.

More Telugu News