Chandrababu: నాలుగేళ్లలో ప్రాజెక్టులకు కనీసం గ్రీజు కూడా పెట్టలేదు: వైసీపీ సర్కారుపై చంద్రబాబు మండిపాటు

  • వైసీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదన్న చంద్రబాబు
  • నిధులు కేటాయించకుండా ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తారని ప్రశ్న
  • కోస్తాంధ్ర ప్రాజెక్టులపై తాము రూ.21,442 కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడి
  • వైసీపీ సర్కారు 4,375 కోట్లు మాత్రమే వెచ్చించిందని విమర్శ
tdp chief chandrababu Fires on ycp govt

ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టులకు కనీసం గ్రీజు కూడా పెట్టలేదని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలుకొని వెలుగొండ వరకు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఈ రోజు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

కోస్తాంధ్ర ప్రాజెక్టులపై టీడీపీ హయాంలో రూ.21,442 కోట్లు ఖర్చు పెట్టామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4,375 కోట్లు మాత్రమే వెచ్చించారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పరిస్థితిపై తాను ప్రెస్‌మీట్‌ పెట్టి వాయిస్తుండటంతో సీఎస్‌ హడావిడిగా సమీక్షలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో మొత్తంగా 64 ప్రాజెక్టులు మొదలుపెట్టి 23 పూర్తి చేశామని గుర్తుచేశారు. 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించామని చంద్రబాబు చెప్పారు. 

ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా నిర్మాణం ఎలా పూర్తిచేస్తారని ఆయన ప్రశ్నించారు. కోస్తా జిల్లాలో పడకేసిన సాగునీటి ప్రాజెక్టులపై ఆయన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఏపీలోని 69 నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తయితే నీటి సమస్యే ఉండదని తెలిపారు. ఉత్తరాంధ్రలో నదుల అనుసంధానం చేసేలా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టినట్లు గుర్తుచేశారు. వంశధార-గోదావరి నదులను అనుసంధానం చేయవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్టులను జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

More Telugu News