america: ఆటపట్టించారని కారుతో ఢీకొట్టి ముగ్గుర్ని చంపేసిన భారతీయుడికి అమెరికాలో జీవిత ఖైదు

  • 2020లో జరిగిన ఘటన
  • డోర్ బెల్ మోగించి ఆటపట్టించిన యువకులు
  • కారులో వారిని వెంబడించి వారి కారును ఢీకొట్టడంతో ముగ్గురి మృతి, మరో ముగ్గురికి గాయాలు
  • ఏప్రిల్ లో దోషిగా తేల్చిన అమెరికా న్యాయస్థానం
Indian Origin Man In US Jailed For Killing 3 Teens Who Pranked Him

రాత్రిపూట డోర్ బెల్ మోగించి తనను ఆటపట్టించారన్న కారణంతో ఉద్దేశపూర్వకంగా ముగ్గురు యువకులపైకి కారు ఎక్కించి హతమార్చడంతో పాటు మరో ముగ్గురు యువకులను తీవ్రంగా గాయపరిచినందుకు అమెరికా న్యాయస్థానం 45 ఏళ్ల భారతీయ సంతతి వ్యక్తికి జీవిత ఖైదు విధించింది. నేరం రుజువైన నేపథ్యంలో ఎలాంటి పెరోల్ కు అవకాశం లేకుండా ఈ శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

2020లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కాలిఫోర్నియాలో నివసిస్తున్న అనురాగ్ చంద్రపై ముగ్గురిని హత్య చేసినట్లు, మరో ముగ్గురిపై హత్యాయత్నం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. విచారణ తర్వాత ఏప్రిల్‌లో దోషిగా తేల్చిన న్యాయస్థానం, తాజాగా శిక్షలు ఖరారు చేసింది. రివర్ సైడ్ కౌంటీలోని జ్యూరీకి ఈ కేసులో తీర్పు ఇవ్వడానికి మూడు గంటలు పట్టినట్లు జిల్లా అటార్నీ కార్యాలయం జులై 14న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. ఆరుగురు యువకులు ప్రయాణిస్తున్న కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టినట్లు విచారణలో తేలింది.

అసలేం జరిగింది?

జనవరి 19, 2020 రాత్రి టెమెస్కల్ కాన్యన్ రోడ్‌లో ఈ ఘటన జరిగింది. ఆరుగురు యువకులు 2002 నాటి టయోటా ప్రియస్ కారులో తన మిత్రుడి ఇంట్లో నిద్రించేందుకు వచ్చారు. అందులో ఒకరు పక్కనే ఉన్న అనురాగ్ చంద్ర డోర్ బెల్ పలుమార్లు మోగించి ఆటపట్టించాడు. ఆ తర్వాత ఆరుగురు తమ కారులో పారిపోయేందుకు ప్రయత్నించారు. అనురాగ్ చంద్ర తన కారులో వారిని వెంబడించాడు. తన కారుతో వారి కారును ఢీకొట్టాడు. దీంతో వారి వాహనం చెట్టుకు ఢీకొని అందులో ముగ్గురు కుర్రాళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత అనురాగ్ చంద్ర ఎవరికీ ఏమీ తెలియజేయకుండా ఇంటికి వచ్చాడు.

ఈ ఘటనలో డేనియల్ హాకిన్స్, జాకబ్ ఇవాస్కు, డ్రేక్ రూయిజ్ అనే ముగ్గురు టీనేజర్లు మృతి చెందారు. వీరందరి వయస్సు 16. కారులో ఉన్న మరో ముగ్గురు గాయపడ్డారు. 18 ఏళ్ల డ్రైవర్‌తో పాటు 13 ఏళ్ల,14 ఏళ్లు కలిగిన ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. 2020 జనవరి 20న అరెస్టైన అనురాగ్ చంద్ర అప్పటి నుండి రివర్ సైడ్ లోని రాబర్డ్ ప్రెస్లీ డిటెన్షన్ సెంటర్‌లో కస్టడీలో ఉన్నాడు. మరో కేసులోనూ దుష్ప్రవర్తన ఆరోపణలు రాగా, అనురాగ్ చంద్ర నేరాన్ని అంగీకరించాడు. 

కాగా ఘటన సమయంలో తాను మద్యం మత్తులో ఉన్నానని కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళన చెందానని కారుతో కావాలని ఢీకొట్టలేదని అనురాగ్ చంద్ర కోర్టులో వాదించాడు. అయితే సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు... అతడు కావాలనే కుర్రాళ్ల కారును ఢీకొట్టినట్టు నిర్ధారించింది.

More Telugu News