London-Delhi Flight: ఫ్లైట్ ఎక్కేందుకు మొండికేసిన పైలట్.. 5 గంటలపాటు విమానంలోనే 350 మంది ఎయిర్ ఇండియా ప్రయాణికులు

  • లండన్-ఢిల్లీ విమానంలో ఘటన
  • ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు అనుకూలించక జైపూర్‌కు మళ్లింపు
  • రెండు గంటల తర్వాత క్లియరెన్స్ లభించినా విమానం నడిపేందుకు పైలట్ నిరాకరణ
  • విమానంలోనే ప్రయాణికుల పడిగాపులు
Passengers stranded for 5 hours as pilot refuses to fly

లండన్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం నిన్న వాతావరణం అనుకూలించకపోవడంతో జైపూర్‌లో అత్యవసరంగా ల్యాండైంది. ఆ తర్వాత విమానం నడిపేందుకు పైలట్ నిరాకరించడంతో అందులోని 350 మంది ప్రయాణికులు 5 గంటలపాటు విమానంలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. విమానం నిజానికి తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. ఢిల్లీ విమానాశ్రయంలో వాతావరణ పరిస్థితులు కఠినంగా ఉండడంతో దానిని జైపూర్‌కు మళ్లించి ల్యాండ్ చేశారు. అంతకుముందు అది ఢిల్లీ విమానాశ్రయంపై పది నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది.

డ్యూటీ అవర్స్ ముగియడంతోనే..
జైపూర్‌లో ల్యాండైన రెండు గంటల తర్వాత ఢిల్లీ వెళ్లేందుకు విమానానికి క్లియరెన్స్ లభించింది. ఆ విమానంతోపాటు జైపూర్‌కు మళ్లించిన మరిన్ని విమానాలకు కూడా ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. అయితే, విమానాన్ని నడిపేందుకు నిరాకరించిన పైలట్ కిందికి దిగిపోయాడు. డ్యూటీ అవర్స్ ముగిశాయని చెబుతూ విమానం నడిపేందుకు నిరాకరించాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చేసేది లేక ప్రయాణికుల్లో కొందరిని రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీకి తరలించగా, విమాన సిబ్బందిని మార్చిన తర్వాత అదే విమానంలో మిగతా వారిని పంపించారు.

More Telugu News