చంద్రబాబుతో బేరం కుదరకపోవడంతో.. పవన్ కల్యాణ్ మళ్లీ మాట మార్చారు: ద్వారంపూడి
- ద్వారంపూడిపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ కల్యాణ్
- నేను రెండు సార్లు గెలిచాను.. నీవు రెండు చోట్ల ఓడిపోయావంటూ ద్వారంపూడి సెటైర్
- తనను విమర్శించే స్థాయి పవన్ కు లేదని వ్యాఖ్య
తాను మూడు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు గెలిచానని, పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారని ద్వారంపూడి ఎద్దేవా చేశారు. తనను విమర్శించే స్థాయి కూడా పవన్ కు లేదని అన్నారు. గెలిచే సత్తా లేదనే విషయం అర్థమయ్యే... చంద్రబాబుకు అనుకూలంగా పని చేయాలని ఇంతకు ముందు పవన్ నిర్ణయించుకున్నారని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబుతో ప్యాకేజీ, బేరం కుదరకపోవడంతో మళ్లీ మాట మార్చారని, తానే సీఎం అవుతానని అంటున్నారని విమర్శించారు. స్థిరత్వం లేని నాయకుడు పవన్ అని విమర్శించారు. మాటలు మార్చే నాయకుడిని ప్రజలు నమ్మరని చెప్పారు.
కాకినాడలో గత 50 ఏళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్నామని ద్వారంపూడి అన్నారు. సొంత సామాజికవర్గంలో తనకు పెద్దగా మద్దతు లేదని... అన్ని సామాజికవర్గాల ప్రజలు తనను గెలిపించారని చెప్పారు. తాను హీరోనని, పవన్ జీరో అని అన్నారు. పవన్ కు పరిటాల రవి గుండు కొట్టించారని చెప్పారు. ఎమ్మెల్యే, సీఎం కావాలనే నీ కోరిక సినిమాల్లోనే తీరుతుందని అన్నారు.