బాపట్ల టెన్త్ కుర్రాడి సజీవ దహనం కేసులో అసలు విషయం బయటకు!
- తన సోదరిని వేధిస్తుండడంతో నిలదీసిన బాలుడు
- స్నేహితులతో కలిసి గతంలో రెండుసార్లు దాడి
- గ్రామ పెద్దలకు దాడి విషయం చెప్పడంతో కక్ష
- ట్యూషన్ నుంచి వస్తుండగా కొట్టి, కాళ్లు కట్టేసి పెట్రోలు పోసి నిప్పు
బాలుడు పేర్కొన్న వెంకటేశ్వర్‌రెడ్డి.. మృతుడు అమర్నాథ్ సోదరిని పలుమార్లు వేధించాడు. విషయం తెలిసిన అమర్నాథ్ రెండు నెలల క్రితం అతడిని నిలదీశాడు. ఇంకోసారి అలా చేస్తే బాగుండదని హెచ్చరించాడు. దీంతో బాలుడిపై కక్ష పెంచుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి స్నేహితులతో కలిసి రెండుసార్లు బాలుడిపై దాడిచేశాడు. తనపై దాడి విషయాన్ని అమర్నాథ్.. వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు.
దీంతో అమర్నాథ్‌పై మరింత కక్ష పెంచుకున్న నిందితుడు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి నిన్న సైకిలుపై ట్యూషన్ నుంచి వస్తున్న బాలుడిని అడ్డగించి కొట్టాడు. ఆ తర్వాత కాళ్లు కట్టేసి పెట్రోలు పోసి తగలబెట్టాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్‌రెడ్డితోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.