ఓ వీడియో చూసిన తర్వాత వీళ్లు మనుషులా, రాక్షసులా అనిపించింది: చంద్రబాబు

Chandrababu tour in Kuppam
  • కుప్పంలో చంద్రబాబు పర్యటన
  • రెండోరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ అధినేత
  • కుప్పం కార్యకర్తలకు దిశానిర్దేశం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటించారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కుప్పంలో టీడీపీ జెండా ఎగురుతూనే ఉందని అన్నారు. నియోజకవర్గం అభివృద్ది కావాలన్నా, మన పిల్లల భవిష్యత్ బాగుండాలి అన్నా టీడీపీనే గెలవాలని చంద్రబాబు ఉద్ఘాటించారు. 

సంపద సృష్టించటం ఆ సంపదను పేదలకు పంచడం తెలిసిన పార్టీ టీడీపీ అని వెల్లడించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, జనతా వస్త్రాలు వంటి  సంక్షేమ పధకాలకు నాంది పలికిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు.

"ఐటీనీ అందిపుచ్చుకుని సంపద సృష్టించాం. కానీ, వైసీపీ నాలుగేళ్ల పాలనలో  రాష్ట్రాన్ని నాశనం చేశారు. నీతి నిజాయతీకి మారు పేరు కుప్పం ప్రజలు,  నేడు ఇక్కడ రౌడీలు పేట్రేగిపోతున్నారు, నా దగ్గర మీ రౌడీయిజం చెల్లదు. తీవ్ర వాదులపై పోరాడిన పార్టీ, రౌడీలను తుదముట్టించిన పార్టీ టీడీపీ. కుప్పంలో  వైసీపీ గూండాలు బహిరంగంగా ఒక వ్యక్తిపై దాడులు చేయటం ఓ వీడియోలో చూసి చలించిపోయా, అసలు వీళ్లు మనుషులా రాక్షసులా? అనిపించింది. 

పేదలను ధనికుల్ని చేసే బాధ్యత తీసుకుంటాం. నాడు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ లు ఇచ్చాం. కాలేజీ సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి మగవారితో సమానంగా ప్రోత్సహించాం. 

ఆడబిడ్డల్ని మహాశక్తిగా రూపొందిచేందుకు మహాశక్తి పథకం తెచ్చాం. ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 ఇస్తాం. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం కింద ఏడాదికి రూ. 15 వేలు ఇస్తాం. 

యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. రైతులకు ఏడాదికి రూ. 20 వేలు అందజేస్తాం. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం. పి-4తో  పేదల్ని ధనికులుగా చేస్తాం. 

ఇక్కడ 95 శాతం పూర్తైన హంద్రీనీవా పూర్తి చేయలేకపోయారు, నేనుంటే 3 ఏళ్లలోనే పూర్తి చేసి నీళ్లిచ్చేవాడిని.    ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఉద్యోగులు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. 

సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మళ్లీ టీడీపీ గెలవాలి. ఎన్నికలు మరో 9 నెలలే ఉన్నాయి, మీరంతా ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేయండి, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత టీడీపీది. గత 35 ఏళ్లలో నియెజకవర్గంలో జరిగిన అభివృద్ది వచ్చే 5 ఏళ్లలో చేసి చూపిస్తా" అని హామీ ఇచ్చారు.
Go Back to Shorts
Chandrababu
Kuppam
TDP
Chittoor District
Andhra Pradesh

More Telugu News