చరణ్​ సమర్పణలో నిఖిల్ ప్యాన్​ ఇండియా చిత్రం టైటిల్ ఇదే

  • సినిమాకు ‘ది ఇండియా హౌజ్’ టైటిల్ ఖరారు
  • మోషన్ వీడియోను విడుదల చేసిన చరణ్
  • వీర్‌‌ సావర్కర్ జీవిత కథతో తెరకెక్కనున్న సినిమా
కార్తికేయ-2తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్‌ సిద్దార్థ ఇప్పుడు బిజీ అయ్యాడు. వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. తాజాగా మరో భారీ చిత్రానికి ఒకే చెప్పాడు. ఈ చిత్రానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలిసి వీ మెగా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ కంపెనీని చరణ్ ప్రారంభించారు. ఇందులో మొదటి చిత్రంగా నిఖిల్‌తో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ఆదివారం ప్రకటించారు. చిత్రానికి ‘ది ఇండియా హౌజ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. 

స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా చరణ్ టైటిల్, మోషన్ వీడియోను రివీల్‌ చేశారు. కొత్త డైరెక్టర్ రామ్‌ వంశీ కృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. కార్తికేయ2, ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మించిన అభిషేక్ అగర్వాల్‌ ఆర్ట్స్ సంస్థతో, వీ మెగా పిక్చర్స్‌ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. భారత చరిత్రలో మరచిన అధ్యాయం ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని మోషన్ వీడియోలో చిత్ర బృందం తెలిపింది. సావర్కర్‌‌ జీవితంలోని ఓ భాగాన్ని ఇందులో చూపించనున్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు 1905లో లండన్‌లో జరిగిన సంఘటనలు, విప్లవానికి ఆజ్యం పోసిన ఘటనలను చూపెడతారని తెలుస్తోంది.

ఇందులో నిఖిల్ శివ పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ శ్యాంజీ కృష్ణ వర్మ పాత్రలో కనిపిస్తారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నిఖిల్ ప్రస్తుతం ‘స్పై’ చిత్రంలో నటిస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. స్పై జూన్ 29న విడుదల కానుంది.

Ramcharan
Nikhil siddartha
new move
pan india
THE INDIA HOUSE

More Telugu News