Narendra Modi: హిరోషిమాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని కలిసిన ప్రధాని మోదీ

  • జపాన్ లో జీ-7, క్వాడ్ దేశాల సదస్సులు
  • హిరోషిమాలో మోదీ బిజీ
  • పలు దేశాధినేతలతో సమావేశాలు
Modi met Zelensky in Hiroshima

జీ-7 దేశాల సదస్సు, క్వాడ్ దేశాల సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ లో పర్యటిస్తున్నారు. ఈ రెండు సదస్సులకు ఆతిథ్యమిస్తున్న హిరోషిమా నగరంలో మోదీ ఇవాళ వరుస సమావేశాలతో బిజీగా గడిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని కలిశానని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

రష్యాతో సంక్షోభం ముగింపునకు చర్చలు, దౌత్య విధానాలే పరిష్కార మార్గాలు అని, ఈ దిశగా తమ మద్దతు ఉంటుందని జెలెన్ స్కీకి స్పష్టం చేసినట్టు మోదీ వెల్లడించారు. ఉక్రెయిన్ ప్రజలకు మానవతా సాయాన్ని అందించడం కొనసాగిస్తామని జెలెన్ స్కీతో చెప్పినట్టు వివరించారు. 

అంతకుముందు, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తోనూ మోదీ సమావేశమయ్యారు. ఐటీ, ఆవిష్కరణల రంగం, టెక్నాలజీ, సెమీకండక్టర్ల ఉత్పాదన వంటి అంశాలపై సహకార విస్తరణ దిశగా చర్చలు జరిపామని మోదీ వెల్లడించారు. తమ మధ్య చర్చల్లో వాణిజ్య ఒప్పందాలు, రక్షణ రంగ సంబంధాలు బలోపేతం చేసే అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు. 

జపాన్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ హిరోషిమాలో మహాత్మాగాంధీ ప్రతిమను ఆవిష్కరించారు. భారత జాతిపితకు ఘన నివాళి అర్పించారు.

More Telugu News