మూకదాడికి గురైన మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే పరిస్థితి విషమం
- మణిపూర్ లో మైతేయీ తెగకు ఎస్టీ హోదాపై గిరిజనుల నిరసన
- ఆ తెగకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ గిరిజనుల ఆందోళన
- సీఎంను కలిసి వచ్చిన ఎమ్మెల్యే వంగ్‌జాగిన్ వాల్టేపై దాడి
పెర్జాల్ జిల్లాలోని థాన్లోన్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వాల్టే ఇంఫాల్‌లోని తన అధికారిక నివాసానికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. దాడిలో ఎమ్మెల్యేతో పాటు ఆయన డ్రైవర్ గాయపడ్డాడు. ఇద్దరినీ వెంటనే ఇంఫాల్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన ఎమ్మెల్యే పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
కాగా, రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. హింసకు సంబంధించి తీవ్రమైన పరిస్థితులు తలెత్తితే ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులను అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు మణిపూర్‌లో పరిస్థితిపై కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. అదనపు పారా మిలటరీ బలగాలను ఆ రాష్ట్రానికి పంపింది. ఇప్పటి వరకు హింసాత్మక ప్రాంతాల నుంచి 9 వేల మంది ప్రజలను సైన్యం రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆశ్రయం కల్పించింది.