Himachal Pradesh: కొండచరియలతో పాటు కూలిపోయిన రహదారి.. వీడియో ఇదిగో!

  • కాఫ్ను-యాంగ్పా ప్రాంతాల మధ్య తెగిపోయిన రోడ్డు
  • కొండచరియలు విరిగిపడడంతో మధ్యలో కుంగిన రహదారి
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
Landslide in Himachals Kinnaur Takes A Chunk Of Road Along

అకాల వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా భాబా వ్యాలీలో కొండచరియలు విరిగిపడడంతో ఓ రోడ్డు లోయలోకి జారిపోయింది. రహదారి మధ్యలోకి కూలడంతో కాఫ్ను, యాంగ్పా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొండపై ఉన్న ఈ రహదారిపై తొలుత పగుళ్లు ఏర్పడ్డాయి. నెమ్మదిగా పగుళ్లు పెద్దగా మారడంతో వాహనదారులు జాగ్రత్తగా రాకపోకలు సాగించారు. శనివారం రోడ్డు దాదాపు మొత్తంగా కూలిపోయింది. రోడ్డు కింది భాగంలో కొండచరియలు విరిగిపడడంతో రోడ్డు కూడా తెగిపోయింది. ఈ ఘటన జరిగినపుడు ఆ రహదారిపై వాహనాలు ఏవీ ప్రయాణించకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైందని స్థానికులు చెబుతున్నారు. ఇదంతా అక్కడికి దగ్గర్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

రాష్ట్రంలోని కిన్నౌర్ జిల్లా తాంగ్లింగ్ తెహసిల్ కల్పలో గత గురువారం కొండ చరియలు విరిగిపడడంతో యాపిల్ తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, తోటలపై బండరాళ్లు పరుచుకున్నాయని అధికారులు తెలిపారు. ఇక ఈ నెల 3న సోలన్ జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడడంతో ఓ పెట్రోల్ పంపు పూర్తిగా ధ్వంసమైంది. కాగా, హిమాచల్ ప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో కొండప్రాంతాల్లోని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

More Telugu News