భారత్ లో జరిగే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ మ్యాచ్ లు ఆ రెండు వేదికల్లోనే!
- అక్టోబర్–నవంబర్ లో భారత్ లో వన్డే ప్రపంచ కప్
- మొత్తం 12 నగరాల్లో 46 మ్యాచ్ లు
- భారత్, పాక్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చే నగరంపై ఉత్కంఠ
తొలుత ఆసియా కప్ కోసం టీమిండియా.. పాక్‌కు రాకపోతే తాము వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గతంలో హెచ్చరించింది. అయితే, ఐసీసీ జోక్యంతో ఈ విషయంలో పీసీబీ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టుకు కేటాయించే వేదికల విషయంలో ఐసీసీ ఎగ్జిక్యూటివ్ స్థాయి వ్యక్తి పీసీబీతో చర్చలు జరుపుతున్నారు. చెన్నై, కోల్ కతాలో ఆడేందుకు పాక్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక, మెగా టోర్నీలో ఇండియా, పాక్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 1.32 లక్షల సీటింగ్ సామర్థ్యం కలిగిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తే ఐసీసీకి మంచి లాభాలు రానున్నాయి. కానీ, ఆ స్టేడియంలో ఫైనల్ జరగనుంది. కాబట్టి భారత్, పాక్ మ్యాచ్ కోసం వేరే వేదికను ఎంచుకోవాల్సి ఉంది. ఏ నగరానికి అవకాశం దక్కుతుందో చూడాలి.